కరోనా కేసుల్లో దేశంలోనే రెండో స్థానానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Aug 2020 11:42 PM GMT
కరోనా కేసుల్లో దేశంలోనే రెండో స్థానానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్

దేశం లోనే అత్యధిక కరోనా కేసులు ఉన్న రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. కరోనా వైరస్ కేసులలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడును దాటుకుని వెళ్ళింది. 4.24 లక్షల కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదయ్యాయి.

10000కు పైగా కరోనా కేసులు వరుసగా అయిదు రోజులు నమోదవ్వడంతో కరోనా కేసుల్లో తమిళనాడును వెనక్కు నెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 4,24,767 కు చేరుకోగా.. తమిళనాడులో 4.16 లక్షల కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర కరోనా కేసుల సంఖ్యలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.

36,66,422 టెస్టులను ఆంధ్రప్రదేశ్ లో చేశారు.. పాజిటివిటీ రేటు 11.59 శాతంగా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల తర్వాత పాజిటివిటీ రేట్ అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. తమిళనాడులో పాజిటివిటీ రేటు 8.93 శాతం ఉంది.

కోవిద్ టెస్టులు అత్యధికంగా చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఒక మిలియన్ కు గానూ 68,660 కోవిద్-19 టెస్టులను ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించారు.

గడిచిన 24గంటల్లో 63,077 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 10,603 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,24,767కి చేరింది. నెల్లూరులో పద్నాలుగు మంది, చిత్తూరులో పన్నెండు మంది, కడపలో తొమ్మిది మంది, అనంతపూర్‌లో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఏడుగురు, తూర్పుగోదావరిలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, కర్నూల్‌లో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, ప్రకాశంలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు మొత్తం 88 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,884 కి చేరింది.

కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో తమిళనాడు లాక్ డౌన్ ను పొడిగించింది. సెప్టెంబర్‌ 1 నుంచి అన్‌లాక్‌ 4.0 అమలు కానుండటంతో తమిళనాడు మాత్రం సెప్టెంబర్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాప్తిస్తుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వచ్చే వాళ్లకు ఈ-పాస్‌ తప్పనిసరి అయింది.

భారత దేశంలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 35 లక్షలు దాటింది. ఒకటే రోజు 78761 కరోనా కేసులతో భారత్ రికార్డు సృష్టించింది.

Next Story