కరోనా వార్డులోని బాత్రూం క‌డిగిన ఆరోగ్యశాఖ మంత్రి.. వీడియో వైరల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2020 11:17 AM GMT
కరోనా వార్డులోని బాత్రూం క‌డిగిన ఆరోగ్యశాఖ మంత్రి.. వీడియో వైరల్‌

నాయకుడు జనంలోంచి రావాలి. అలా వచ్చిన వాళ్లతోనే ప్రజలకు మంచి జరుగుతుంది. ఎన్నికలొస్తే గానీ ప్రజల ఇబ్బందులు పట్టించుకోని రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో.. కరోనా విజృంభిస్తోన్న వేళ పారిశుద్ధ్యం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి స్వయంగా రంగంలోకి దిగి అసలైన లీడర్ అనిపించుకున్నారు.

పుదుచ్చేరి ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌ల్లాడి కృష్ణారావు ప్ర‌జ‌ల ముందుగానీ, పార్టీ కార్య‌క‌ర్త‌ల ముందుగానీ తాను ఒక మంత్రిని అనే ద‌ర్పం ప్ర‌ద‌ర్శించ‌రు. సాదాసీదాగా ఉంటారు. శ‌నివారం కూడా ఆయ‌న మ‌రోసారి త‌న నిరాడంబ‌ర‌త్వాన్ని చాటుకున్నారు. పుదుచ్చేరిలోని ఇందిరాగాంధీ ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీ & ఆస్ప‌త్రిలోని కొవిడ్ వార్డును సంద‌ర్శించి.. ఆయ‌న బాత్రూంలో మురికిని చూసి సఫాయివాలా అవ‌తారం ఎత్తారు.

అసలేం జరిగిందంటే.. కొవిడ్‌ బాధితులను మంత్రి కృష్ణారావు పరామర్శించారు. ఈ సందర్భంగా కొందరు రోగులు టాయిలెట్లు శుభ్రంగా లేవంటూ మంత్రి గారికి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రిగారే స్వయంగా రంగంలోకి దిగారు. ఒక చేత్తో నీళ్ల బ‌కెట్‌, మ‌రో చేత్తో చీపురు అందుకుని టాయిలెట్‌ను శుభ్రం చేయ‌డం మొద‌లుపెట్టారు. ఒక‌వైపు బాత్రూం క‌డుతూనే మ‌రోవైపు ఆ వార్డు ఆయాకు చీవాట్లు పెట్టారు. ఇలా క‌డిగితే ఈ మురికి మొత్తం పోతుంది. అందులో ఇబ్బంది ఏముంద‌మ్మా..? అంటూ సుతిమెత్త‌గా మంద‌లించారు. మరుగుదొడ్లు ఉపయోగించాక నీళ్లతో శుభ్రం చేసేయాలని.. ఎవరో వచ్చి క్లీన్​ చేస్తారని వేచి చూడొద్దని కరోనా బాధితులకు మంత్రి సూచనలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.



Next Story