ఏపీలో కొత్త ఇండస్ట్రీయల్ పాలసీకి శ్రీకారం.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Aug 2020 3:57 AM GMT
ఏపీలో కొత్త ఇండస్ట్రీయల్ పాలసీకి శ్రీకారం.!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2020-23 పారిశ్రామిక విధానానికి సంబంధించి కొత్త ఇండస్ట్రియల్ పాలసీకి శ్రీకారం చుట్టనుంది. ఈ నూతన పాలసీని నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పారిశ్రామిక​ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, ఏపీఐసీసీ చైర్‌పర్సన్‌ రోజా విడుదల చేయనున్నారు.

సీఎం జగన్.. ప్రజలు, పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసే సరికొత్త పారిశ్రామిక విధానం, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించారు. పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక వేత్తలను ఆకర్షించేలా ఈ పాలసీకి రూపకల్పన చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు అందించనున్నారు.

సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు కొత్త ఇండస్ట్రియల్ పాలసీ పెద్ద సాయంగా నిలవనుంది. పారదర్శకత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఫార్మా, టెక్స్‌టైల్స్ , ఆటోమొబైల్స్ , ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్‌ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా అదనపు రాయితీలు ఉండనున్నాయి.

Next Story