కాకినాడ తీరంలో ఇండో-అమెరికా సైనిక విన్యాసాలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Nov 2019 11:21 AM GMT
కాకినాడ తీరంలో ఇండో-అమెరికా సైనిక విన్యాసాలు..!

ముఖ్యాంశాలు

  • ‘టైగర్ ట్రయాంఫ్’ పేరుతో సైనిక విన్యాసాలు
  • ఓ వైపు యుద్ధ ట్యాంకులు, మరో వైపు త్రివిధ దళాల ట్రూపులు
  • యుద్ధ వాతావరణాన్ని తలపించేలా సైనిక విన్యాసాలు
  • విన్యాసాల్లో హైలెట్‌గా నిలిచిన అమెరికా జర్మన్‌టౌన్‌ నౌక

కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌ సాగర తీరాన సైనిక విన్యాసాలను భారత్‌, అమెరికా ఉత్సహంగా నిర్వహిస్తున్నాయి. ఓ వైపు యుద్ధ ట్యాంకులు, మరో వైపు త్రివిధ దళాల ట్రూపులు మోహరించాయి. ఈ విన్యాసాలను భారత్, అమెరికా త్రివిధ దళాలు ‘టైగర్ ట్రయాంఫ్’ (పులి విజయం) పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, కాకినాడలోని బీచ్‌ నేవల్‌ ఎన్‌క్లేవ్‌లో నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో తీరంలోని ప్రత్యేక పటిష్టమైన బందోబస్తును ఏర్పాటును చేశారు. శుత్రువును మట్టికరిపిస్తూనే ఆయుధాలను రక్షించుకుంటూ సైనికులు విన్యాసాలు చేపట్టారు. సముద్రంలోని భూమి మీదకు వస్తూ ఒళ్లు గగుర్పుడిచేలా మెరైన్స్‌ స్టంట్స్‌ చేశారు. అదే సమయంలో హెలికాప్టర్ల నుంచి తాళ్ల సాయంతో సైనికులు వేగంగా కిందకు దిగుతున్నారు.

శుత్రువులపై విరుచుకుపడాలన్న లక్ష్యంతో ఉన్న సైనికుల అగ్రహావేశాలు.. అక్కడి యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. యద్ధ ట్యాంకులు, రాకెట్ లాంచర్లు, ఆయుధ సంపత్తితో సైనికులు తమ సత్తాను ప్రదర్శించారు. యుద్ధం సమయంలోనూ, పకృతి వైపరీత్యాల సమయంలోనూ గాయపడ్డవారిని యుద్ధనౌకలోకి వేగంగా తరలించడం.. అలాగే ఆయుధ సామాగ్రిని మిత్రదేశానికి ఇచ్చి వాటిపై అప్పుడే తర్ఫీదు ఇవ్వడం ఇలా అంత ముమ్మరంగా సైనిక విన్యాసాలు జరిగాయి. బృందాలుగా విడిపోయిన సైనికులు.. సైనిక దళాలు ఎలా పని చేస్తాయో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ నెల 13 నుంచి ప్రారంభమైన విన్యాసాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈ విన్యాసాల్లో 500 మంది అమెరికన్ మెరైన్స్, సెయిలర్స్, ఎయిర్‌మెన్, భారత దేశపు త్రివిధ దళాలకు చెందిన 1,200 మంది పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా అమెరికా జర్మన్‌టౌన్‌ నౌక

భారత్‌కు చెందిన ఐఎన్‌ఎస్ జలష్వా, ఐఎన్‌ఎస్ ఐరావత్‌తో పాటు అమెరికాకు చెందిన యూఎస్‌ఎస్ జర్మన్ టౌన్ యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో ఆకర్షణగా నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా సవాల్‌ విసురుతున్న టెర్రరిజాన్ని అణిచివేసేందుకు భారత్‌, అమెరికా ఈ విన్యాసాలను నిర్వహించాయి. తీరంలో ముందుగా ఏర్పాటు చేసిన బంకర్లను చేరుకొని శత్రువు కనిపించకుండా అందులోనుంచి మెషీన్‌గన్‌లతో గస్తీ నిర్వహించారు. ఈ విన్యాసాల్లో భూ, జల మార్గాల్లో పయనించే అమెరికా జర్మన్‌టౌన్‌ నౌక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత్‌, అమెరికాలు ఆయుధ సంపత్తితో తమ సత్తాను ప్రదర్శించాయి. శుత్రవులను ఎలా మట్టుబెట్టాలన్న దానిపై సైనికులు మాక్‌ఫైర్‌ నిర్వహించారు.

సైనిక విన్యాసాలను చీఫ్‌ ఫ్లీట్‌ కమాండర్‌, రియల్‌ అడ్మిరల్‌ సూరజ్‌ బెర్రీ పర్యవేక్షించారు. నావికాదళానికి చెందిన ఎంఐ-17 హెలీకాప్టర్లు రెండు, ఎంఐవీ-17 హెలికాప్టర్లు ఆకాశమార్గంలో గస్తీ నిర్వహించాయి. ఈ విన్యాసాలతో భారత్, అమెరికా మధ్య రక్షణ విషయంలో సత్సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి. భద్రత, పరస్పర సహకారం, విపత్తుల వేళ పరస్పర తోడ్పాటు వంటి అంశాలను బలోపేతం చేసుకోవడమే ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం. కాగా బుధవారంతో సైనిక విన్యాసాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో విన్యాసాలను తిలకించడానికి ప్రజలకు అవకాశం కల్పించారు.

Next Story