రమేశ్ కుమార్‌ను తిరిగి నియమించండి.. ఏపీ హైకోర్టు తీర్పు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 May 2020 1:51 PM IST
రమేశ్ కుమార్‌ను తిరిగి నియమించండి.. ఏపీ హైకోర్టు తీర్పు

సంచలనంగా మారిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును తాజాగా ఇచ్చింది. ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్న రమేశ్ కుమార్ ను తొలగిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ఈ ఎపిసోడ్ లో భాగంగా పలు జీవోల్ని ఏపీ సర్కారు జారీ చేసింది. వాటిని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రమేశ్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాదు.. ఎస్ఈసీకి సంబంధించి మార్చిన నిబందనలతో తీసుకొచ్చిన ఆర్డినెన్సును కొట్టివేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్సును ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అన్నింటికి మించి.. తాము తీర్పు చెప్పిన క్షణం నుంచి ఏపీ ఎన్నికల కమిషనర్ గా రమేశ్ కుమార్ కొనసాగుతారని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మీడియాతో మాట్లాడారు.

హైకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల కమిషనర్ గా కనగరాజు కొనసాగటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఆర్డినెన్సును రద్దు కావటంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీగా ఉన్నట్లేనని న్యాయవాది పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో ఏపీ ప్రభుత్వం పట్టుదలగా ఉన్న వేళ.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Next Story