ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ.. మూడు రాజధానులు, సీఆర్‌డీఏ బిల్లులపై హైకోర్టు స్టే
By తోట వంశీ కుమార్ Published on 4 Aug 2020 11:25 AM GMTఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదరుదెబ్బ తగిలింది. మూడు రాజధానులపై విడుదల చేసిన గెజిట్ ను నిలిపి వేయాలని దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. గెజిట్ పై స్టే ఇచ్చింది. రాజధాని తరలింపుతో పాటు, సీఆర్డీఏ రద్దు చట్టాలపై స్టే విధించింది. 10 రోజుల పాటు యథాతథ స్థితి అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. 14వ తేదీ వరకు స్టే కొనసాగుతుందని పిటిషన్ ను విచారించిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయడానికి 10 రోజుల సమయం కావాలని కోర్టును ప్రభుత్వ తరపు లాయర్లు కోరారు.
ఏపీలో మూడు రాజధానులకు గవర్నర్ ఆమోద ముద్రవేయడాన్ని రాజధాని రైతు పరిరక్షణ సమితి తీవ్రంగా తప్పుబట్టింది. ఈ క్రమంలోనే సోమవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జీఎన్ రావు, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమని ప్రకటించాలన్న పిటిషనర్ కోర్టును కోరారు. రాజ్ భవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు గవర్నర్ గెజిట్‌పై స్టేటస్ కో విధించింది.
ఇప్పటివరకు రైతులు, రైతు పరిరక్షణ సమితి తరపున 4 పిటిషన్ లు వేశారు. రైతులు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ తన వాదన వినిపించారు. రెండు బిల్లుల కు సంబంధించిన కేస్ లు విచారణకు జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ శేససాయిలతో కూడిన ధర్మాసనం ఏర్పాటుయింది. అయితే ఈ రోజు విచారణ ఉండడంతో సీడ్ యాక్సిస్ రోడ్ కు ఇరువైపులా మోకాళ్ళ మీద నిలిచి వెంకటపాలెం, ఉద్దండరాయని పాలెం, తాళ్లాయపాలెం, మందడం, వెలగపూడి, లింగాయపాలెం, రాయపూడి, తుళ్ళూరుకు చెందిన రైతులు, రైతు కూలీలు తన నిరసన వ్యక్తం చేసారు.