రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల‌కు గవర్నర్ ఆమోదం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 July 2020 10:52 AM GMT
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల‌కు గవర్నర్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన సీఆర్‌డీఏ-2014 రద్దు, రాజ‌ధాని వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన‌ బిల్లును పరిశీలించిన గవర్నర్‌.. తన ఆమోద ముద్రవేశారు. దీంతో.. ఇప్పటివరకూ ఏపీ రాజధానిగా ఉన్న అమరావతి ఇక నుంచి శాసన రాజధానిగా మారనుంది.

తాజా నిర్ణయంతో.. ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందనున్నాయి. వికేంద్రీకరణ బిల్లును మూడు వారాల క్రితం జగన్ సర్కార్ గవర్నర్‌కు పంపింది. ఇప్పుడు.. గవర్నర్ ఆమోదించడంతో మూడు రాజధానులకు లైన్ క్లియర్ అయినట్టయింది.

ఇదిలావుంటే.. ప్ర‌భుత్వం రాజధానిపై సలహాలు, సూచనల కొరకు 2019 సెప్టెంబర్‌ 13న రిటైర్డ్‌ ఐఏఎస్‌ జీఎన్‌ రావు కమిటీని ఏర్పాటు చేసింది. మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కమిటీ.. 2019 డిసెంబర్‌ 20న తన నివేదికను సమర్పించింది. మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా వికేంద్రీకరణకు కమిటీ సిఫార్సు చేసింది.

కమిటీ సమర్పించిన నివేదిక పరిశీలన కొరకు 2019 డిసెంబర్‌ 29న రాష్ట్ర ప్ర‌భుత్వం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 2020 జనవరి 3న బోస్టన్‌ కన్సెల్టెన్సీ గ్రూపు తన నివేదికను సమర్పించింది. రెండు కమిటీల నివేదికలపై హైపవర్‌ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది.

ఆ త‌ర్వాత‌ హైపవర్‌ కమిటీ నివేదికపై 2020 జనవరి 20న మంత్రిమండలి చర్చించింది. 2020 జనవరి 20న బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. అనంత‌రం 2020 జనవరి 22న శాసనమండలిలో బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌గా.. టీడీపీ వ్యతిరేకించింది. అనంత‌రం న్యాయ నిపుణుల సలహా మేరకు 2020 జూన్‌ 16న రెండోసారి వికేంద్రీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. తాజాగా ఈ బిల్లుకు గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్ ఆమోద ముద్రవేయడంతో మూడు రాజ‌ధానుల అంశానికి‌ లైన్‌క్లియర్‌ అయ్యింది.

Next Story
Share it