ఆగస్టు 5 నుండి జిమ్స్ ఓపెన్.. ఒక్కసారి ఎంత మంది ఉండొచ్చంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 July 2020 11:35 AM GMT
ఆగస్టు 5 నుండి జిమ్స్ ఓపెన్.. ఒక్కసారి ఎంత మంది ఉండొచ్చంటే..!

విశాఖపట్నం: జిమ్ లో ఉండి గంటల తరబడి కసరత్తులు చేసేవారైతే మీకో గుడ్ న్యూస్..! వైజాగ్ లో జిమ్ లను త్వరలోనే తెరవనున్నారు. కానీ అతి తక్కువ మందిని అనుమతిస్తూ ఉండడంతో జిమ్ ఫీజుల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది.

వైజాగ్ జిమ్ ఓనర్స్ అసోసియేషన్ జిమ్ లను తెరవడంపైనా, జిమ్ లలో ఉండాల్సిన ఏర్పాట్లపైనా చర్చించారు. జిమ్ లలో కరోనా వ్యాప్తి జరగకుండా కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జిమ్ కు వచ్చే వారి సంఖ్య కూడా బాగా తగ్గనుంది. జిమ్ లో ఉండి కసరత్తులు చేసుకునే వారి సంఖ్య కూడా తగ్గుతూ ఉండడంతో వాటిని మెయింటెయిన్ చేయాలంటే జిమ్ ఫీజులు కూడా పెంచాల్సి వస్తోందని తెలుస్తోంది.

విశాఖ జిమ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిలాని గణేష్ మాట్లాడుతూ 'మొదటి నెలలో మునుపటి ఫీజు తీసుకోవాలని అనుకుంటూ ఉన్నాము. ఒక నెల పూర్తీ అయ్యాక ఖర్చులను అంచనా వేసుకుని.. జిమ్ కు వచ్చే వారి సంఖ్యను తెలుసుకుని ఫీజులపై ఓ నిర్ణయానికి వస్తాము..' అని తెలిపారు.

జిమ్ లను ఆగస్టు 5 నుండి విశాఖలో తెరవనున్నారు. దేశంలోని అన్ని జిమ్ లను మార్చి 23 నుండి మూసి వేసి ఉన్న సంగతి తెలిసిందే.. కరోనా కట్టడి కోసం జిమ్ లను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు జిమ్ లను తెరుస్తూ ఉండడంతో తక్కువ మందిని మాత్రమే అనుమతించాలని, సెషన్ సమయాన్ని కూడా గంట వరకే కుదించనున్నారు.

1000 చదరపు అడుగులు ఉన్న జిమ్ లలో కేవలం ఆరుగురు మాత్రమే ఉండేలా అనుమతులను ఇచ్చారు. 2000 చదరపు అడుగులు ఉన్న జిమ్ లో గరిష్టంగా ఒక సెషన్ లో 10 మందిని మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. జిమ్ ఓనర్లు ప్రతి సెషన్ తర్వాత జిమ్ మొత్తాన్ని శానిటైజ్ చేసేలా నిబంధనలు తీసుకుని వచ్చారు.

Next Story