ఏపీ ఆసుపత్రుల్లో సీన్ ఏమాత్రం బాగోలేదా?

By సుభాష్  Published on  31 July 2020 5:34 AM GMT
ఏపీ ఆసుపత్రుల్లో సీన్ ఏమాత్రం బాగోలేదా?

పలు రాష్ట్రాలతో పోలిస్తే కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాగుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. అయితే.. మాటల్లో చెప్పినట్లుగా వాస్తవ పరిస్థితి లేదన్న అభిప్రాయం కలిగేలా వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా గురువారం విడుదల చేసిన బులిటెన్ లో 52,123 కొత్తకేసులు నమోదు కావటం తెలిసిందే. అదే సమయంలో ఏపీ సర్కారు విడుదల చేసిన కరోనా బులిటెన్ లో కొత్త కేసులు 10,167 నమోదు కావటం షాకింగ్ గా మారింది. అంటే.. యావత్ దేశంలో నమోదైన కొత్త కేసుల్లో ఇరవై శాతానికి పైనే ఏపీ కేసులు ఉండటం ఆందోళనకరంగా మారింది.

ఇక.. కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్న ఆసుపత్రుల్లో బాధితులు తమకు సరైన వైద్యం అందటం లేదంటూ హాహాకారాలు చేస్తున్నారు. వైద్యులు.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం పలువురు ప్రాణాలు కోల్పోయేలా చేస్తుందని చెబుతున్నారు. కరోనా పేషెంట్ల కష్టాల్ని చూస్తే.. అయ్యో అనుకోకుండా ఉండలేం. = అలాంటి దారుణ పరిస్థితుల్లో కదిలించి వేసేలా ఉన్న కొన్ని ఉదంతాల్ని చూస్తే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరింత దూకుడు ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

కరోనా వైద్యానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. బ్రహ్మండంగా పని చేస్తున్నారని చెబుతున్న మాటలకు.. వాస్తవానికి పొంతన ఉండటం లేదన్న మాట వినిపిస్తోంది. దీనికి నిదర్శనంగా పలు ఉదంతాల్ని ప్రస్తావిస్తున్నారు. వీటి గురించి తెలిసినంతనే భయంతో వణికి పోవాల్సిందే.

- నెల్లూరు జీజీహెచ్ కోవిడ్ ఆసుపత్రిలో ఒక ముసలాయన బ్రాతూంలో పడి మరణించాడు. అతడెప్పుడు మరణించాడో తెలీదు. గురువారం ఆయన్ను ఉంచిన వార్డులోని బాధితులు బాత్రూంకు వెళ్లిన సందర్భంలో అక్కడ పడిపోయి ఉన్నాడని సిబ్బందికి తెలియజేయటంతో అతను మరణించిన విషయాన్ని అక్కడి సిబ్బంది గుర్తించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మరణించాడని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆక్సిజన్ అందక చనిపోయినట్లుగా వైద్యులు చెబుతున్నారు. ఆక్సిజన్ అంత అవసరమైప్పుడు.. బాత్రూంకు ఒక్కడే వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న వాదనకు వైద్యులు.. వైద్య సిబ్బంది సమాధానం చెప్పలేకపోవటం గమనార్హం.

- ఏపీలోని ఐదు ప్రధాన కోవిడ్ ఆసుపత్రులకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది విజయవాడ.అలాంటి ఒక కోవిడ్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇలాంటి దారుణమైన పరిస్థితి కోవిడ్ ఆసుపత్రిలో ఉందా? అన్న సందేహం కలిగేలా ఉంది. బ్యాంకు మేనేజర్ గా వ్యవహరించే ఒక మహిళ ఇటీవల కరోనా బాధితురాలయ్యారు. ఆమెను విజయవాడ లోని కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

గడిచిన నాలుగు రోజులుగా ఆమె ఐసీయూలోనే ఉన్నారు. అయినప్పటికీ ఆమెనుపట్టించుకున్న నాథుడే లేడని వాపోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆమె పక్కనున్న బెడ్ మీద చికిత్స పొందుతున్న రోగి ఒకరుమరణించాడు. మరణించిన వ్యక్తిని మార్చురీకి తరలించకుండా అలానే ఉంచేశారు. అర్థరాత్రి వేళ భయంతోఆమె ఇంటి వారికి ఫోన్ చేసి తాను ఉన్న దారుణ పరిస్థితి గురించి వివరించటం.. హుటాహుటిన జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించారు.

దీంతో సానుకూలంగా స్పందించిన ఆయన.. డెడ్ బాడీని తరలించారు.దీనిపై ఆసుపత్రి వైద్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. మా మీదే కలెక్టర్ గా కంప్లైంట్ చేస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా సదరు మహిళా బ్యాంకు మేనేజర్ వాపోవటం చూస్తే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే రీతిలో పలు ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి.

Next Story
Share it