ప్రజల డేటాను సేకరించడానికి సిద్ధమైన ఏపీ సర్కార్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Jun 2020 1:31 PM GMT
ప్రజల డేటాను సేకరించడానికి సిద్ధమైన ఏపీ సర్కార్

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రజల డేటాను సేకరించేందుకు సిద్ధమవుతోందట. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగుతోంది. ఈ ప్రచారం మేరకు.. మొత్తం నాలుగు పత్రాల్లో అందరి డేటాను సేకరించనున్నారట. సమాచార సేకరణ పత్రము పేరుతో ఉన్న దాదాపు వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం తీసుకోనున్నారని తెలుస్తోంది.

ఈ నాలుగు పత్రాలను పరిశీలిస్తే ఇంటి నెంబరు, అడ్రస్, పంచాయతీ పేరు, పుట్టిన గ్రామం, పూర్తి పేరు, విద్యార్హతలు, సంవత్సర ఆదాయం, కుటుంబం వివరాలు ఇవ్వవలసి ఉంటుందని తెలుస్తోంది. సామాజిక వివరాలు కూడా సేకరించనున్నారట. కులం, ఉపకులం, మతం, తెగ గురించి అడగనున్నారు. హిందూ, ముస్లీం, క్రిస్టియన్, బౌద్ద, జైన లేదా ఇతర మతస్తులయితే ఆయా మతాల్లోని ఏ తెగ లేదా కులానికి సంబంధించిన వారో చెప్పవలసి ఉంటుంది.

ఆధార్, ఓటరు కార్డు, ఓటు ఎక్కడ ఉంది, ఈ-మెయిల్ అడ్రస్ వంటి వాటి వివరాలు ఇవ్వాలి. గ్యాస్ కనెక్షన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనాలు, రేషన్ కార్డుకు సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఏం ఉద్యోగం చేస్తున్నారు లేదా వ్యాపారం, వ్యవసాయం, గృహిణి, విద్యార్థి అంశాలు పేర్కొనవలసి ఉంటుంది. మీ వృత్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి. విద్యార్థి అయినా ఏ కాలేజీ, ప్రదేశం వివరాలు అందించాలి. మరో ఆసక్తికర విషయం ఏమంటే మీ ఫేస్‌బుక్, వాట్సాప్ నెంబర్, ట్విట్టర్ ఐడీ, ఇన్‌స్టాగ్రామ్ వివరాలు కూడా ఇవ్వాలట.

మీ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వవలసి ఉంటుందట. దీర్ఘకాలిక వ్యాధులు, ఆరోగ్యశ్రీ వివరాలు పొందుపరచవలసి ఉంటుంది. ఇళ్లు, వ్యవసాయ భూమి ఉంటే అందుకు సంబంధించిన వివరాలు, పెన్షన్ వివరాలు, ప్రభుత్వ రుణాలు, తీసుకుంటే ఏ రకమైన రుణం వంటి ప్రశ్నలుంటాయని తెలుస్తోంది. ఇష్టమైన ఆటలు, అలవాట్లు కూడా ఇందులో పొందుపరిచారని తెలుస్తోంది. ఈ పత్రం చివరలో మీ గ్రామానికి అవసరమైన సౌకర్యాలు ఏమైనా ఉంటే పేర్కొనవలసి ఉంటుంది. ఇందులో వాలంటీరు, సెక్రటరీ, గ్రామ ఇంచార్జ్, అభ్యర్థి నలుగురు సంతకం చేయవలసి ఉంటుంది.

Next Story
Share it