జగన్ సర్కారు.. నెదర్లాండ్స్ ప్రభుత్వం.. ఓ మంచి డీల్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Sep 2020 3:00 PM GMT
జగన్ సర్కారు.. నెదర్లాండ్స్ ప్రభుత్వం.. ఓ మంచి డీల్

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. పాలన మొదలైన కొన్ని నెలల నుంచి ప్రభుత్వం తీరు విమర్శల పాలవుతూనే ఉంది. ఏదో ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం.. సర్వత్రా విమర్శలు ఎదుర్కోవడం.. కోర్టుతో మొట్టికాయలు వేయించుకోవడం సర్వ సాధారణం అయిపోయింది.

జగన్ అంటే విధ్వంసం తప్ప అభివృద్ధి శూన్యం అనే అభిప్రాయం క్రమంగా జనాల్లోకి వెళ్లిపోతోంది. సంక్షేమ పథకాల్ని పక్కాగా అమలు చేయడం మినహాయిస్తే జగన్ సర్కారు తీరు మొత్తం వివాదాస్పదమే. అభివృద్ధి మీద, దీర్ఘ కాలికంగా రాష్ట్రానికి మంచి చేసే పనుల మీద జగన్ సర్కారుకు శ్రద్ధ లేదన్న అభిప్రాయం పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం ఒక మంచి పనితో వార్తల్లోకి వచ్చింది.

రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించి జగన్ సర్కారు నెదర్లాండ్స్ ప్రభుత్వంతో పాటు ఇతర కంపెనీలతో ఎనిమిది ఎంవోయూలు చేసుకోవడం విశేషం. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్, టెక్నాలజీపై దృష్టి పెడుతూ ఈ ఒప్పందాలు చేసుకున్నారు. ముఖ్యంగా అరటి, టొమాటో, మామిడి, చీనీ, మిర్చి, కూరగాయలు సహా పలు వ్యవసాయ ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి ఈ ఒప్పందాలు జరిగాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పై కొత్త టెక్నాలజీ, కొత్త ఉత్పత్తుల తయారీపై కంపెనీ ప్రతినిధులు ఏపీ సీఎంకు వివరించారు.

అరటి పంటకు సంబంధించి ఎన్ఆర్సీ బనానా తిరుచ్చితో ఒప్పందమైంది. మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ప్రమోషన్‌‌తో పాటు క్వాలిటీ టెస్టింగ్ లేబరేటరీలపై ఈ కంపెనీ పని చేస్తుంది. అరటి సహా పండ్లు, కూరగాయల ఫుడ్ ప్రాసెసింగ్ కు సంబంధించి పుణెకు చెందిన ఫ్యూచర్ టెక్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు.

టొమాటో, అరటి ప్రాసెసింగ్ విషయంలో మౌళిక సదుపాయాల కల్పన కోసం బిగ్ బాస్కెట్‌తో ఒప్పందం జరిగింది. మామిడి, చీనీ, మిరప పంటల ప్రాసెసింగ్ విషయమై ఐటీసీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ కంపెనీతో ఉల్లి ప్రాసెసింగ్ పై ఒప్పందమైంది. వరుస వివాదాలు, విమర్శల వేళ జగన్ సర్కారుకు సంబంధించిన ఒక పాజిటివ్ న్యూస్ ఇది అనడంలో సందేహం లేదు.

Next Story