నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారంలో గవర్నర్ కీలక ఆదేశాలు..
By తోట వంశీ కుమార్ Published on 22 July 2020 6:19 AM GMTనిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తిరిగి నియమించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ పంపారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వకపోవడంతో పాత స్థానాన్ని పునరుద్దరించాల్సిందిగా జగన్ ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు.
అసలేం జరిగిందంటే:
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం 2020 మార్చి 7న షెడ్యూల్ ప్రకటించింది. ఓ పక్క ఎన్నికల నిర్వహణ కొనసాగుతుండగానే.. దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని ఎన్నికలను వాయిదా వేస్తూ రమేశ్‌కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో తనకు రాష్ట్రంలో భద్రత లేదని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని మార్చి 18న ఎన్నికల కమిషనర్ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. దీంతో ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా రమేశ్ కుమార్‌కు చెక్ పెట్టింది.
దీనిని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు విచారణ చేపట్టిన న్యాయస్థానం నిమ్మగడ్డను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్ని రద్దు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి రమేశ్‌కుమార్‌ను నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా.. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషిన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా గవర్నర్‌ను కలిపి వినతిపత్రం సమర్పించాలని, హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరమని చెప్పింది. దీంతో సోమవారం గవర్నర్‌ను కలిసిన నిమ్మగడ్డ వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన గవర్నర్ నిమ్మగడ్డను తిరిగి ఎస్‌ఈసీ గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.