Fact Check : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జాతీయ పతాకాన్ని తలక్రిందులుగా ఎగరేశారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Aug 2020 12:30 PM ISTస్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పలువురు నేతలు జాతీయ పతాకాలను ఎగరేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా పలువురు నేతలు స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి జాతీయ పతాకాన్ని తలక్రిందులుగా ఎగరేశారంటూ వాట్సప్ లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
సాక్షి పత్రికలో భారత జాతీయ పతాకాన్ని తలక్రిందులుగా ఎగరేసినట్లు చిత్తూరు జిల్లా ఎడిషన్ లో ప్రచురించడం జరిగినట్లు పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. జాతీయ పతాకాన్ని అవమానించారంటూ పలువురు కామెంట్లు చేశారు.
నిజ నిర్ధారణ:
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని తలక్రిందులుగా ఎగురవేశారన్న వార్తలో ఎటువంటి నిజం లేదు.
ఈ ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా పలువురు ప్రముఖులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యామాల్లో పోస్టు చేశారు. ఆ ఫోటోలలో భారత జాతీయ పతాకాన్ని డిప్యూటీ సిఎం నారాయణ స్వామి సరైన రీతిలోనే ఎగురవేసినట్లు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లా కలెక్టర్ ఖాతాలో కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఫోటోలను చూడొచ్చు.
nh9news.com కథనాలు గమనించవచ్చు.
సాక్షి పేపర్ జాతీయ పతాకాన్ని ప్రింట్ చేయడంలో తప్పు చేసిందంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేశారు.
మీ పేపర్లో జాతీయ జెండాని తిరగేసి ప్రింట్ చేసి ఎవరిమీద అక్రమకేసులు పెడతారు, మాజాతీయ జెండాని అవమానించినందుకు సాక్షిపేపర్ మీద కేసుఫైల్ చేయండి,కింద ఫొటోస్లో ఎడిట్ముందు ఎడిట్చేసిన తర్వాత అలానే అస్సలు పేపర్లో వచ్చిన ఫొటోస్ కూడాఉంచాం,ఒక్కకేసు ఐనా తెలుగుదేశం కార్యకర్తలు పైనపడితే ఊరుకోము pic.twitter.com/x6Ry1nN4pH
— Anusha vundavalli (@Anushavundaval3) August 16, 2020
ఆగష్టు 17న సాక్షి యాజమాన్యం పత్రికలో జాతీయ పతాకాన్ని ప్రచురించడంలో తప్పు జరిగిందంటూ వివరణ ఇచ్చింది. ఆగష్టు 16వ తేదీ ఆదివారం చిత్తూరు జిల్లా ఎడిషన్ మొదటి పేజీలో జాతీయ జెండా ఫోటో తిరగబడి ప్రచురితమైంది. సాంకేతిక కారణాల వలన జరిగిన ఈ పొరపాటుకు చింతిస్తున్నామంటూ వివరణ ఇచ్చారు న్యూస్ పేపర్ ఎడిటర్.
జాతీయ పతాకం తలక్రిందులుగా ఉండడం అన్నది తమ తప్పు అని పత్రిక యాజమాన్యం ఒప్పుకుంది. అంతేకానీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి భారత పతాకాన్ని తలక్రిందులుగా ఎగురవేశారన్నది 'నిజం కాదు'.