Fact Check : రోడ్డు మీద గుంతల్లో వర్షపు నీరు.. దూసుకుని వెళ్తున్న వాహనాలు.. ఈ వీడియో హైదరాబాద్ కు చెందినదేనా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Aug 2020 1:56 PM GMT
Fact Check : రోడ్డు మీద గుంతల్లో వర్షపు నీరు.. దూసుకుని వెళ్తున్న వాహనాలు.. ఈ వీడియో హైదరాబాద్ కు చెందినదేనా..?

కార్లు, బస్సులు, భారీ వాహనాలు రోడ్డు మీద ఉన్న గుంతలను దాటుకుని వెళుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అక్కడ ఎటువంటి గుంత లేదేమో అనుకుంటూ కొన్ని వాహనాలు రావడం.. అందులోకి దిగబడడం ఆ వీడియోలో చూడొచ్చు.

“Latest Made in Telangana (special) vehicle suspension testing machine installed successfully by GHMC on roads of Hyderabad (FREE testing for all) The Bangaru Telangana already created (KCR Garu) which the ‘prince in waiting’ (KTR Garu) will be crowned soon!” అంటూ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు.

H1

"లేటెస్ట్ మేడిన్ తెలంగాణ(స్పెషల్) వాహనాల సస్పెన్షన్ టెస్టింగ్ పరికరాన్ని జీహెచ్ఎంసీ అధికారులు ఇటీవలే రోడ్ల మీద అమర్చారు. అది కూడా అందరికీ ఉచితంగా...! బంగారు తెలంగాణ కేసీఆర్ గారు తయారు చేశారు.. త్వరలోనే కేటీఆర్ గారు బంగారు తెలంగాణ బాధ్యతలను స్వీకరించనున్నారు" అంటూ ట్వీట్ లో ఉంచారు.

నిజ నిర్ధారణ:

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియోకు హైదరాబాద్ కు ఎటువంటి సంబంధం లేదు. ఇదొక తప్పుడు వార్త.

ఈ వీడియోను బాగా గమనించగా “小强兄弟 123” అనే లోగోను చూడచ్చు.

ఈ వీడియోకు చెందిన కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా నిడివి ఎక్కువ గల వీడియో దొరికింది. ఆ వీడియో నిడివి 1:54 నిమిషాలు ఉంది. చైనాకు చెందిన వెబ్ సైట్ లో జులై 17, 2020న ఈ వీడియోను అప్లోడ్ చేశారు. ఎన్ని కార్లు ఈ గుంతల్లో వెళ్తాయో చూద్దాం.. వెళ్లే ముందు జాగ్రత్తగా వుండండి అంటూ ఆ వీడియో కింద చెప్పుకొచ్చారు.

H2

జులై 11, 2020న అలాంటి వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. “Potholes on Chinese roads after heavy rain” అంటూ చైనా రోడ్ల మీద ఉన్న గుంతలకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు.

నిడివి ఎక్కువ ఉన్న వీడియోలో ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోలేదని ఎన్నో క్లూలు లభిస్తాయి. రోడ్డు పక్కన ఉన్న షాప్ లు, స్టోర్ ల మీద చైనీస్ భాషలో ఉండడాన్ని గమనించవచ్చు.

వీడియోలో వెళ్లిన వాహనాలను చూస్తే డ్రైవింగ్ చేస్తున్న విధానం లెఫ్ట్-హ్యాండ్ సైడ్ డ్రైవింగ్ గా గమనించవచ్చు. భారత్ లో రైట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది.

H3

వాహనాలు రోడ్డు మీద గుంతల్లో పడుతూ వెళ్లడం హైదరాబాద్ లో చోటుచేసుకుంది అంటూ ప్రచారం అవుతున్న వీడియో విషయంలో ఎటువంటి నిజం లేదు.

Next Story