వీధికుక్కలను కాపాడడానికి వెళ్లిన వారిపై దాడి చేశారు.. ఇంతకూ ఏమి జరిగింది..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 July 2020 4:21 PM IST
వీధికుక్కలను కాపాడడానికి వెళ్లిన వారిపై దాడి చేశారు.. ఇంతకూ ఏమి జరిగింది..?

న్యూఢిల్లీ: ఢిల్లీ కి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యులు వీధికుక్కలను కాపాడడానికి వెళ్ళినప్పుడు తమపై దాడి చేసారంటూ రక్తపు మడుగులో ఉన్న ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అయింది. మూగజీవాలను కాపాడడానికి వెళ్లిన ప్రతి సారీ తమపై దాడులు జరుగుతూనే ఉన్నాయని.. ప్రజలు మానవత్వం మరచి ప్రవర్తిస్తున్నారని.. పోలీసులు కనీసం స్పందించడం లేదంటూ వీడియోను అప్లోడ్ చేశారు.

భారత రాజధాని ఢిల్లీలో శుక్రవారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. Neighbourhood Woof అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన అయేషా క్రిస్టినా తన బృందంతో కలిసి వీధికుక్కలను కాపాడడానికి వెళ్ళింది. రాణి బాఘ్ లోని రిషి నగర్ లోని వీధికుక్కలకు తిండి తినిపించడానికి ప్రయత్నిస్తూ ఉండగా తమపై కొందరు స్థానికులు దాడి చేశారని వారు చెబుతూ ఉన్నారు.

అయేషా క్రిస్టినా వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసి తాము కుక్కలను పట్టుకుంటూ ఉన్న సమయంలో కొందరు తమ దగ్గరకు వచ్చారు.. చెత్తగా వాగారు. ప్రతి సారీ తమకు ఇలాంటి ఘటనలే జరుగుతూ ఉండేవి. కానీ మేమందరూ సైలెంట్ గా ఉండేవాళ్ళం.. కానీ ఈ సారి తాము స్థానికులతో కాస్త గట్టిగా మాట్లాడినందుకు తమపై దాడి చేశారని అయేషా తెలిపింది. ముఖం మీద రక్తంతో ఉన్న అయేషా వీడియోలో తనతో పని చేసే విపిన్, అభిషేక్, దీపక్ ల పరిస్థితి కూడా ఇలాంటిదే అని చెప్పుకొచ్చింది. పోలీసు స్టేషన్ లో కేసు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే సరైన రెస్పాన్స్ కూడా లేదంటూ అయేషా తెలిపింది.

ఢిల్లీ కమీషన్ ఫర్ విమెన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ కూడా ఈ ఘటనపై స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై శనివారం నాడు స్పందించిన ఢిల్లీ పోలీసులు కేసును రిజిస్టర్ చేశామని, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని అన్నారు. స్థానికులతో చోటుచేసుకున్న గొడవ కారణంగానే వీరిపై దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు. ఎన్.జి.ఓ. సభ్యులు అక్కడి నుండి కారులో వచ్చే సమయంలో వీరి కారు వలన ముగ్గురు స్థానికులకు కూడా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

Next Story