సంపద సృష్టిస్తామని, మోసాలతో నింపేశారు..కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

By Knakam Karthik
Published on : 22 May 2025 1:03 PM IST

Andrapradesh, Ys Jagan, AP Government, Cm Chandrababu, Tdp, Janasena, Bjp

సంపద సృష్టిస్తామని, మోసాలతో నింపేశారు..కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం గత 12 నెలల్లో రాష్ట్రాన్ని అవినీతి, అప్పుల ఊబిలోకి నెట్టిందని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. తన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని మోసాలతో నింపేశారని జగన్ విమర్శించారు. "కాగ్ నివేదికను పరిశీలిస్తే అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు, సంక్షేమం ఊసే లేదు. ఈ సంవత్సర కాలంలో పెట్టుబడులు తగ్గాయి, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం లేదు. అదంతా బాబు అనుకూల గజదొంగల జేబుల్లోకి వెళ్తోంది" అని ఆరోపించారు. తమ హయాంలో కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించామని, అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజలకు మంచి పరిపాలన అందించామని జగన్ గుర్తుచేశారు.

కేవలం 12 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేశారని ఆరోపించారు. "కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో 13.76 శాతం పెరుగుదల కనిపిస్తే, రాష్ట్ర రెవెన్యూలో కేవలం 3.8 శాతం మాత్రమే వృద్ధి ఉంది. మా ఐదేళ్ల పాలనలో రూ. 3,32,671 కోట్ల అప్పు చేస్తే, చంద్రబాబు కేవలం 12 నెలల్లోనే రూ. 1,37,546 కోట్ల అప్పు చేశారు. మేము ఐదేళ్లలో చేసిన అప్పును చంద్రబాబు ఏడాదిలోనే చేసి చూపించారు. అప్పులు తేవడంలోనూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు" అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో లిక్కర్, ఇసుక, క్వార్ట్జ్, మైనింగ్, సిలికా వంటి అన్ని రంగాల్లో మాఫియాలు రాజ్యమేలుతున్నాయని జగన్ ఆరోపించారు. "మైనింగ్ నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రావడం లేదు. చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారు. 4 గంటల పీక్ అవర్ కోసమంటూ 24 గంటలకు యూనిట్‌కు రూ.4.60 చొప్పున విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. మా హయాంలో రూ.2.49కే విద్యుత్ కొన్నాం, రాష్ట్ర ఖర్చు తగ్గించాం. ఇప్పుడు విద్యుత్ కొనుగోలులోనూ పెద్ద స్కామ్ జరిగింది" అని ఆయన వివరించారు. ఉర్సా అనే సంస్థకు బిడ్ లేకుండా రూ.2 వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారని, అమరావతి పేరుతో దోపిడీ స్కాములకు పరాకాష్టగా నిలిచిందని జగన్ ఆరోపించారు. తాము కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామని, తమ యుద్ధం చంద్రబాబుతోనే కాకుండా, చెడిపోయిన ఎల్లో మీడియాతో కూడా అని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story