పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం బొల్లవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. బొల్లవరం పరిధిలోని మాదల మేజర్ కాలువ కట్టపై ఈ ఘటన జరిగింది. ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మహిళా కూలీలు మిరపకోతలకు వెళ్లి తిరిగి గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని సత్తెనపల్లి హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో మొత్తం 25 మంది మహిళా కూలీలు ఉన్నట్లు గుర్తించారు.