ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఉదయం నుంచి అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొదటగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. ఈ క్రమంలో అంబటి రాంబాబు టీడీపీ నేతలకు కౌంటర్‌గా చేసిన వ్యాఖ్యలతో గందరగోళం ఏర్పడింది. దీంతో మంత్రులు, వైసీపీ సభ్యుల తీరును చంద్రబాబు తప్పుబట్టారు. భావోద్వేగానికి గురైన చంద్రబాబు సభలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించారు.
సభలో చర్చల సందర్భంగా విమర్శలు, ప్రతివిమర్శలు ఎన్నోసార్లు తాను చూశానని.. కానీ వ్యక్తిగతంగా తన భార్య, కుటుంబ సభ్యులపై చేస్తున్న విమర్శలతో కలత చెందానని అన్నారు. వైసీపీ సభ్యులు శృతి మించి వ్యవహరిస్తున్నారని అన్నారు. కుటుంబంలోని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇకపై.. తాను ముఖ్యమంత్రి అయ్యాకే తిరిగి సభలో అడుగుపెడతానని చంద్రబాబు అన్నారు. సభలో జరిగిన పరిణామాలపై ఆవేదనతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని వెల్లడిస్తున్నప్పుడు చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.