ప్రధాన మంత్రిని కలిసిన ఎస్సీ హాస్టల్ విద్యార్థులు

Students of AP SC hostel who met the Prime Minister. ఎస్సీ హాస్టల్స్ కు చెందిన విద్యార్థులు తమ విజ్ఞాన యాత్రలో భాగంగా ఢిల్లీలో దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి మాట్లాడారని

By Medi Samrat  Published on  19 March 2023 4:01 PM GMT
ప్రధాన మంత్రిని కలిసిన ఎస్సీ హాస్టల్ విద్యార్థులు

Students of AP SC hostel who met the Prime Minister


ఎస్సీ హాస్టల్స్ కు చెందిన విద్యార్థులు తమ విజ్ఞాన యాత్రలో భాగంగా ఢిల్లీలో దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి మాట్లాడారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగానే ప్రధాని విద్యార్థులతో ముచ్చటించడంతో పాటుగా వారికి పుస్తకాలను కూడా బహూకరించారని వెల్లడించారు. ఇండియన్ బ్యాంక్ తన సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో ఈ యాత్ర ఏర్పాటు చేయడం జరిగిందని ఆదివారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి నాగార్జున చెప్పారు. ఈ యాత్రలో రాష్ట్రంలోని వైయస్సార్ కడప, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఎస్సీ హాస్టళ్లలోని ప్రతిభావంతులైన 42 మంది బాల, బాలికలు పాల్గొన్నారని చెప్పారు. ఈ నెల 14 నుంచి 19 దాకా కొనసాగిన ఈ యాత్రలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న విద్యార్థులు అక్కడి పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగానే విద్యార్థులతో కొద్ది సమయాన్ని గడిసిన ప్రధాని వారితో ముచ్చటించారని వారి ప్రయాణ వివరాలను అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ముఖ్యంగా స్వాతంత్ర్య సమర యోధుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు, స్వామి వివేకానంద వంటి మహనీయుల జీవిత గాథలు చదివి వాటి ద్వారా స్ఫూర్తిని పొందాలని ప్రధాని విద్యార్థులకు ఉద్భోధించారని వివరించారు. పరీక్షల విషయంలో భయాలను విడనాడాలని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని తమ భవిష్యత్తును ఉజ్వలంగా మలచుకోవాలని, భావి భారత పౌరులుగా ఉన్నత స్థానాలకు ఎదగాలని కూడా విద్యార్థులకు హితవు చెప్పారన్నారు. నైతిక విలువలు పాటిస్తూ నీతి నిజాయితీలతో సంపాదించాలని, సంపాదించిన ధనాన్ని వృధా చేయకుండా పొదుపు చేయాలని కోరడంతో పాటుగా జన్ ధన్ ఖాతాలను ప్రారంభించి వాటి ద్వారా పొదుపును ప్రారంభించాలని ప్రధాని ఈ సందర్భంగానే విద్యార్థులకు సూచించారని నాగార్జున వెల్లడించారు. తమ పరీక్షలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాలను కూడా ప్రధాని బహూకరించి వారితో ఫోటోలు దిగారని చెప్పారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులు పార్లమెంటును సందర్శించగా అక్కడి అధికారులు పార్లమెంటులో ఎవరు ఎక్కడ కూర్చుంటారనే వివరాలను విద్యార్థులకు తెలుపుతూ పార్లమెంటు మొత్తాన్ని చూపించారని తెలిపారు. తమ విద్యార్థులు దేశ ప్రధానిని కలిసి మాట్లాడటం సంతోషంగా ఉందని నాగార్జున పేర్కొన్నారు.


Next Story
Share it