ప్రభుత్వ పథకాలకు సీఎం పేరుపై.. ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం.!

Public interest litigation in AP High Court on behalf of government schemes names. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రారంభిస్తున్న చాలా పథకాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేరు పెట్టడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

By అంజి  Published on  9 Dec 2021 1:46 PM IST
ప్రభుత్వ పథకాలకు సీఎం పేరుపై.. ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం.!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రారంభిస్తున్న చాలా పథకాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేరు పెట్టడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హైకోర్టు ధర్మాసనం.. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. కాగా తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు పథకాలకు సీఎం జగన్‌ పేరు పెట్టడంపై పూర్తి నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు పేర్లు మార్చి సీఎం జగన్‌ పేరు పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ డాక్టర్‌ మద్దిపాటి శైలజ్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ మన్మథరావుతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

జగన్‌ తన పేరు పెట్టుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వ్యక్తిగతంగా ప్రచారం చేసుకుంటున్నారని వ్యాజ్యంలో పిటిషన్‌ దారు పేర్కొన్నారు. ఇవాళ ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ప్రభుత్వ పథకాల పేర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాన్ని, అలాగే పథకాలకు పెట్టిన పేర్లను పరిశీలించి నివేదిక ఇవ్వాలని పిటిషనర్‌కు సూచించింది. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పేర్లను ఎలా పెట్టుకుంటుందని ప్రశ్నిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ప్రభుత్వం రాసిన లెటర్‌ను కూడా అఫిడవిట్‌ రూపంలో కోర్టుకు అందించాలని సూచించింది.

Next Story