పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక టెన్షన్ పడకండి
Pawan Kalyan Tested Negative For Covid-19. తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా
By Medi Samrat Published on 8 May 2021 2:16 PM IST![పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక టెన్షన్ పడకండి పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక టెన్షన్ పడకండి](https://telugu.newsmeter.in/h-upload/2021/05/08/297583-pawan-kalyan-tested-negative-for-covid-19.webp)
తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఏమైనా అయిందని తెలిస్తే చాలు అభిమానులు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. ఇటీవల ఆయన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే..! ఈ విషయం తెలిసి అభిమానులు తల్లడిల్లిపోయారు. ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేసిన వీరాభిమానులు కూడా ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం గురించి జనసేన పార్టీ నుండి ఓ అధికారిక ప్రకటన వచ్చింది. పవన్ కళ్యాణ్ కరోనాను జయించారని జనసేన పార్టీ ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టింది.
పవన్ కళ్యాణ్ గత నెల కరోనా బారినపడడంతో హైదరాబాద్ లోని వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక ఆయనకు మూడు రోజుల క్రితం వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారని, అందులో నెగెటివ్‌గా నిర్ధారణ అయిందని పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేరిట ఈ ప్రకటన విడుదలైంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కు ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని వైద్యులు తెలిపారని చెప్పారు. తన ఆరోగ్యం బాగుపడాలని పూజలు, ప్రార్థనలు చేసిన జనసైనికులు, అభిమానులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపినట్లుగా అందులో ఉంది. భారతదేశంలో కరోనా తీవ్రంగా ఉందని.. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని.. వైద్య నిపుణుల సూచనలను పాటించాలని కోరారు.
పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలలో నటించనున్నారు. ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా స్పీడ్ పెంచారు.