బాబాయ్‌ను లేపేస్తే అది వార్తే కాదు : పవన్ కళ్యాణ్
పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని వైరల్ చేస్తున్నారని డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
By - Medi Samrat |
పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని వైరల్ చేస్తున్నారని డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. శుక్రవారం ఉదయం పిఠాపురంలోని ఆర్ ఆర్ బి హెచ్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఠాపురంలో చెట్టు మీద ఆకు ఊగినా, పక్షి ఈక రాలినా ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారన్నారు. పులివెందులలో సొంత బాబాయ్‌ని చంపినా అది వార్త కాదు.. పిఠాపురంలో స్కూల్ పిల్లలు కొట్టుకున్నా అది పెద్ద వార్త అవుతుందన్నారు. ఎంతో విజ్ఞత ఉన్న రాజకీయ నాయకులే మాటకు మాట అనుకుంటున్న రోజులివి. అలాంటిది చిన్న పిల్లలు ఒక మాట అనుకోరా? దానికి కులాలను మధ్యలోకి తీసుకురావాలా? గత ప్రభుత్వానికి తెలిసింది ఒక్కటే... బూతులు తిట్టడం, కేసులు పెట్టడం, ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేయడం.. ఇప్పుడు అదే పద్ధతిని అవలంబిస్తున్నారన్నారు. పిఠాపురం వచ్చి గొడవలు చేద్దాం.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడదాం అనుకుంటే ఇక్కడే కూర్చొని ఏరివేస్తానన్నారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వ్యవస్థలకు ఎవరూ అతీతులు కాదు.. ముఖ్యమంత్రి అయినా, నేను అయినా తప్పు చేస్తే శిక్షించే పరిస్థితులు ఉండాలని అసెంబ్లీలో చెప్పాం.. నన్ను ఒక మాట అన్నా పడతాను, పార్టీని దూషించినా భరిస్తాను.. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే మాత్రం ఉపేక్షించనన్నారు. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి.. నా మాటలు మెత్తగా ఉంటాయి.. కానీ చాలా గట్టిగా తీసుకుంటానన్నారు.