విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించుకునేందుకు కార్మికులు చాలా రోజుల నుండి పోరాటం చేస్తున్నారు. వీరి పోరాటానికి ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలు మద్ధతు ఇచ్చాయి. అయితే స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాగా కార్మికులు చేస్తున్న పోరాటానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే మద్దతు తెలిపారు. కార్మికుల పోరాటానికి మద్ధతుగా ఇవాళ పవన్ కల్యాణ్ దీక్షకు దిగారు. మంగళగిరిలోని జనసేన పార్టీ హెడ్ ఆఫీస్‌లో ఆయన నిరసన దీక్ష చేపట్టారు. గత 300 రోజులకుపైగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన సాగుతోంది. వారికి నైతికంగా మద్దతు ఇచ్చేందుకు పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టారని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి.
పవన్ కల్యాణ్ దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అంతకుముందు పవన్ శ్రమదానం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లే దారిలో వడ్డేశ్వరం దగ్గర పారపట్టి కంకరను గుంతల్లో వేశారు. ఏపీలో రోడ్ల దుస్థితి నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి మద్ధతుగా నిరసన దీక్ష చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన స్పందన లేదని పవన్ విమర్శించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తమ పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుందన్నారు. కార్మికులు ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదని, ఇప్పటికే అన్ని రకాల చర్యలు ప్రారంభించిందని అన్నారు.