తిరుపతిలో జనసేన పోటీపై పవన్ కే క్లారిటీ లేదా..?
Pawan Kalyan About Tirupati Loksabha Bypoll. తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్ సభ బైపోల్ లో జనసేన పోటీపై పవన్ కే క్లారిటీ లేదా.
By Medi Samrat Published on 22 Jan 2021 5:58 PM ISTతిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్ సభ స్థానం ఉపఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల సంఘం త్వరలోనే షెడ్యూలు విడుదల చేయనుంది. ఇక్కడ జనసేన పోటీ చేయాలని భావించి.. మొదట్లో కాస్త దూకుడుగా ముందుకు వెళ్ళింది. ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి వచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీ ఒప్పుకోవట్లేదని తెలుస్తోంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వరుసగా విజయాలను అందుకుంటూ ఉంది. అదే ఊపు తిరుపతి ఉప ఎన్నికలో చూపించడానికి కూడా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. భారతీయ జనతా పార్టీ-జనసేన మధ్య పొత్తు ఉన్న సంగతి తెలిసిందే..! బీజేపీ పోటీ చేస్తుందా లేక జనసేన పోటీ చేస్తున్నా అనే విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతూ ఉన్నాయి.
జనసేన తిరుపతి ఉప ఎన్నికలో పోటీ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో జనసేన నిలిస్తే ఏడు నియోజకవర్గాల్లోనూ తానే ప్రచారం చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన పవన్ అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థిపై మరో వారంలో నిర్ణయం తీసుకుంటామని.. ఇందు కోసం మరోమారు సమావేశం కానున్నట్టు చెప్పారు. ఒకవేళ జనసేన కాకుండా బీజేపీ నిలిస్తే హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసినట్టు బలంగా పోటీ చేయాలని కోరారు. మతం పేరిట రాజకీయాలు చేయడం ఇష్టం లేకే తాను రామతీర్థం వెళ్లలేదని పవన్ చెప్పారు.
బీజేపీ అగ్రనాయకత్వానికి ఉన్నంత అవగాహన, ఇక్కడ రాష్ట్ర నాయకత్వంలో కనిపించడం లేదని అన్నారు. బీజేపీ కేంద్ర పెద్దలు ఇస్తున్నంత మర్యాద రాష్ట్రంలో బీజేపీ నాయకులు జనసేనకు ఇవ్వడం లేదని పీఏసీలో నేతలు అంటున్నారు. కలసి ప్రయాణం చేయాలంటే చిన్న చిన్న తప్పులు సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలి. ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దలకు కూడా చెప్పా. వాళ్లు చెబితే ఇక్కడ నేతల తీరు మారుతుందని ఆశిస్తున్నానని పవన్ చెప్పుకొచ్చారు.