బీజేపీ ఎంపీ జీవీఎల్ నరింహారావు.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్ర సర్కార్ నిధులు ఇస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదని జీవీఎల్ ఆరోపించారు. 'వైసీపీ.. అంటే ఏమీ చేతగాని ప్రభుత్వం' అనేలా తయారైందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను రాష్ట్ర ప్రజలకు వివరిస్తామని జీవీఎల్ చెప్పారు. ఢిల్లీలో ఎంపీ జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. కాగా డిసెంబర్ 28వ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పరిపాలనలో వైఫల్యం చెందిందన్నారు.
అనేక పథకాలకు నిధులను ఇచ్చినప్పటికి దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలను తుంగలో తొక్కి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. కేంద్ర పథకాలకు రాష్ట్రం నిధులు ఇవ్వకపోవడంతో కేంద్రం నిధులు రావడం లేదని, వైసీపీ చేతకానితనంతో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిందని జీవీఎల్ అన్నారు. యూపీ రాష్ట్రం తర్వాత అత్యధిక నిధులు ఇచ్చింది ఏపీకేనని జీవీఎల్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక వైఫల్యానికి ఒక కేసు స్టడీలా ఆంధ్రప్రదేశ్ తయారైందని ఎంపీ జీవీఎల్ ఆరోపించారు.