అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. భారత ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ పనులను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని టూర్ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు. సభా వేదికతో పాటు, గ్యాలరీల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు, త్రాగునీరు వంటి ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు.
అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని రాక కోసం యావత్ ఆంధ్రప్రదేశ్ రెట్టించిన ఉత్సాహంతో ఎదురుచూస్తుంది. ప్రధాని చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతాం. ప్రజా రాజధాని నిర్మాణానికి మోడీ ఆశీస్సులు, ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యం ఎంతో కీలకం. మూడేళ్లలో కచ్చితంగా ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మిస్తాం. కూటమి పార్టీలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ..వరల్డ్ క్లాస్ సిటీని నిర్మిస్తాం..అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.