ఆయనపై తిరుగుబాటు మొదలైంది.. కేఏ పాల్‌కు-పవన్‌కు తేడా లేదు
Minister Jogi Ramesh Fire On Chandrababu, Pawan. 45 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు
By Medi Samrat Published on 28 Aug 2022 2:49 PM IST45 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు కానీ, ఏ వర్గానికి, ఏ కులానికి అయినా మేలు చేసిన దాఖలాలు లేవని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. 33ఏళ్ల పాటు కుప్పం ఎమ్మెల్యేగా పనిచేసి, 45 ఏళ్లపాటు కేబినెట్ ర్యాంకులో వివిధ పదవులు నిర్వహించిన బాబు.. మా కుప్పానికి ఏం చేశాడు? మాకు ఏం చేయగలిగాడు అని అక్కడ ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు వల్లే చంద్రబాబును నిలదీస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
చంద్రబాబుపై తిరుగుబాటు తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచే మొదలైందని.. మరీ ముఖ్యంగా కుప్పంలో ఉన్న బీసీల నుంచే తిరుగుబాటు ప్రారంభమైందని అన్నారు. రాజకీయంగా తమను వాడుకోవడమే కాకుండా, అధికారంలో ఉన్నప్పుడు బీసీలను చంద్రబాబు చెంచాల్లా చూశాడని., బీసీలను బానిసలను చేశాడనే అభిప్రాయంతో బీసీ వర్గాల ప్రజలు చంద్రబాబును తరిమి,తరిమి కొట్టడానికి కుప్పం నుంచే నాంది పలికారని పేర్కొన్నారు.
ఒకవైపు బీసీలు, మరోవైపు ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, రైతన్నలు, మహిళలు కూడా చంద్రబాబు మాకు వద్దని చెబుతున్నారు. అసలు చంద్రబాబుకు కుప్పం వచ్చే అర్హత ఉందా అని అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని అన్నారు.
అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలోనే జగన్ అర్హత ఉన్న ప్రతి గడపకు అమ్మ ఒడి, చేయూత, ఆసరా, రైతు భరోసాతో పాటు ప్రతి నెల పెన్షన్ పంపిస్తున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని రాష్ట్ర ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారని అన్నారు. ప్రతి గడపకు సంక్షేమంతో పాటు అభివృద్ధిని ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్నారని అన్నారు. చంద్రబాబుకి, ప్రతి గడపకు వచ్చి తాను ఫలానా పథకం అమలు చేశానని చెప్పుకునేందుకు ఏదీ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మంచిపని కూడా చేయలేని చంద్రబాబు మా ప్రభుత్వంపై విమర్శలా?. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మూడుసార్లు కూడా కుప్పం రాని చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం సిగ్గు, శరం లేకుండా ఇప్పుడు మూడురోజులు పర్యటన అంటూ హడావుడి చేస్తున్నాడని.. అక్కడ ప్రజలు తరిమి కొడుతున్నారని అన్నారు.
అన్న క్యాంటీన్ అంటు హంగామా చేస్తున్న చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్నిచోట్ల అన్న క్యాంటిన్లు పెట్టారు?. ఈ రాష్ట్రంలో ఎంతమంది అన్న క్యాంటిన్లలో భోజనాలు చేశారు అని అడుగుతున్నాం. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసి అడ్డుకోవాలని చూసినా మేం ప్రతి గడపకు, కోట్ల మందికి సంక్షేమాన్ని అందిస్తున్నామని అన్నారు.
జనసేనను తన పార్టీలో విలీనం చేసుకోవాలని పవన్‌కల్యాణ్‌కు, కేఏపాల్ ఉచిత సలహా ఇచ్చాడు. కేఏపాల్‌కు పవన్ కల్యాణ్ కు వ్యత్యాసం లేదు. కేఏ పాల్‌కు ఏపీలో సీట్లు లేవు. పవన్ కల్యాణ్‌కు కూడా అంతే. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఓటును అంతా కలిపిస్తానంటూ పవన్ కబుర్లు చెబుతున్నాడు. ఏం కలిపేస్తాడు.? మా పార్టీకి ఎవరు వ్యతిరేకం అని అడుగుతున్నాం. ఓ వైపు చంద్రబాబును బీసీలు మొదలు అన్ని వర్గాల ప్రజలు తరిమి కొడుతున్నారు. అలాంటి బాబుకు పవన్ మద్దతా?. సిగ్గులేకుండా చంద్రబాబును మోయమని కాపులను పవన్ అడుగుతున్నాడు. 175స్థానాల్లో పోటీ చేస్తావా లేదా అని అడిగితే దానికి సమాధానం ఉండదు. చంద్రబాబును మాత్రం మోస్తానని చెబుతాడు.
చంద్రబాబు నాయుడును జాకీలు, మోకులు, జేసీబీలను పెట్టి లేపుదామన్నా కుప్పకూలిపోయాడు. అలాంటి వ్యక్తిని పవన్ కల్యాణ్ ఏం మోస్తాడని అడుగుతున్నాం. చంద్రబాబు, పవన్ లు దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు. వారికి మద్దతుగా ఉన్న ఎల్లో మీడియా, సోషల్ మీడియా వారిని పైకి లేపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు ఎక్కడ లెగుస్తారు? 73 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబు మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. తాము అధికారంలో ఉండగా.. ఈ పథకం అమలు చేశామని చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు, ఆయన పార్టీ ఉంది. ఇలాంటి నమ్మక ద్రోహులు మా ప్రభుత్వంపై బురదచల్లే కార్యక్రమం చేస్తున్నారని ఫైరయ్యారు.