ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కలచివేసింది. గౌతంరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న జగన్ కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అయితే ఈ రాత్రికి ఆయన భౌతికకాయాన్ని నెల్లూరుకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాగా, మంత్రి మేకపాటి భౌతికకాయాన్ని ఇవాళ రాత్రి హైదరాబాద్ నుంచి నెల్లూరుకు తరలించి, రేపు అభిమానుల సందర్శనార్థం నెల్లూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అమెరికాలో చదువుతున్న గౌతంరెడ్డి కుమారుడు రాగానే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మంత్రి గౌతంరెడ్డి మృతికి రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల సంతాప దినాలు ప్రకటించి, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఉదయం ఛాతీ నొప్పితో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వైద్యులు గౌతమ్‌రెడ్డికి ఐసీయూలో చికిత్స అందించి అత్యవసర సేవలు అందించారు. అయితే చికిత్సకు మంత్రి స్పందించలేదు.