జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ వీరమహిళలతో సమావేశం అయ్యారు. కోనసీమ జిల్లా గంటి పెదపూడిలో వరద బాధితుల బాధితులను జనసేన వీరమహిళలు సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే వైసీపీ ఎమ్మెల్యే వారిని అసభ్య పదజాలంతో దూషించారని పవన్ విమర్శించారు. ఆ ఎమ్మెల్యేపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. వరదల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వీరమహిళలు ప్రయత్నిస్తే, వారిని అడ్డుకోవడం ప్రభుత్వ సంకుచిత ధోరణికి నిదర్శనం అని అన్నారు.
వైసీపీ ఎమ్మెల్యే మహిళలపై ఇష్టానుసారం నోరుపారేసుకోవడం మంచిది కాదని అన్నారు. తమ వీర మహిళలు గంటి పెదపూడిలో వరద బాధితుల సమస్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేను ధైర్యంగా నిలదీశారని తెలిపారు. జనసేన పార్టీకి వీర మహిళలు భవిష్యత్ వారధులని అభివర్ణించారు. వారి పోరాటాలను మరింత విస్తృతం చేస్తామని, అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.
ఇక ప్రముఖ టాలీవుడ్ కమెడియన్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఈరోజు జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబును ఆయన కలిశారు. జనసేనలో చేరబోతున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షలో ఉన్నారు. ఆయన దీక్ష ముగియగానే ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో పృథ్వి జనసేన కండువా కప్పుకోనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన జనసేన తరపున తన స్వస్థలం తాడేపల్లిగూడెం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది.