జనసేన కౌలు రైతు భరోసా యాత్ర శనివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభమైంది. జనసేనాని పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం చేరుకున్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తల మధ్య యాత్ర ప్రారంభించారు. ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతు పచ్చిమళ్ళ శంకరం కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. శంకరం ఫొటోకు నివాళి అర్పించిన పవన్ కల్యాణ్ ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో ప్రకటించిన రూ.1 లక్షను ఆయన బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఇక గుడ్ మార్నింగ్ సీఎం సార్ పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు ఆ పార్టీ శ్రేణులు.. రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందంటూ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 15, 16, 17వ తేదీల్లో 'గుడ్ మార్నింగ్ సీఎం సర్' హ్యాష్ ట్యాగ్ తో రాష్ట్రంలోని అధ్వాన రోడ్ల ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని జనసేన తమ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పవన్ సోదరుడు నాగబాబు కూడా రంగంలోకి దిగారు. రాజమహేంద్రవరంలో రోడ్లు దారుణంగా ఉన్నాయని చెప్పారు. గుడ్ మార్నింగ్ సీఎం సర్ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకొని ఈ రోడ్డు ముందు నిరసన చేపట్టారు.