జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జనసేన-టీడీపీ కలిసి పని చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే!! ఇక ఈ కూటమిలోకి భారతీయ జనతా పార్టీని కూడా తీసుకుని రావాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పొత్తుల విషయంలో బీజేపీని ఒప్పించాలని పవన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో పొత్తులపై బీజేపీ అధిష్టానంతో మంతనాలు జరపనున్నారు.
అయితే పొత్తుకు సంబంధించి టీడీపీ ఉల్లంఘనకు పాల్పడిందంటూ పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం ఉల్లంఘించిందని పవన్ ఆరోపించారు. జనసేనతో చర్చించకుండానే సీట్లు ఎలా ప్రకటిస్తారు? అని ప్రశ్నించారు జనసేనాని. సర్దుబాటుకు ముందే అభ్యర్థుల్ని ప్రకటించడం సరికాదన్నారు. పొత్తులో ఉండగా మండపేట అభ్యర్థిని చంద్రబాబు ఎలా ప్రకటిస్తారు? అని ప్రశ్నించారు. చంద్రబాబే సీఎం అభ్యర్థి అని లోకేష్ ప్రకటించినా నేను మౌనంగా ఉన్నా! అని గుర్తు చేశారు. జగన్‌ను గద్దె దించడం కోసమే నేను సంయమనంతో ఉన్నానన్నారు. పొత్తు విచ్ఛిన్నం కావాలంటే ఎంతసేపు?.. పొత్తు ధర్మం పాటించకుండా అభ్యర్థుల్ని ప్రకటించడం ఏంటి? అని పవన్ కళ్యాణ్ నిలదీశారు.