జవాద్ తుఫాను ఎఫెక్ట్‌తో ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జవాద్ తుఫాను మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారనుందని హెచ్చరించింది. శనివారం ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా తుఫాను వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు మధ్యాహ్నం ఒడిశా రాష్ట్రంలోని పూరీ దగ్గర తుఫాను ఉత్తర దిశగా కదులుతూ తీరం దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుఫాను తీరం దాటిన తర్వాత బంగాళాఖాతం వైపు వెళ్తుందని అంచనా. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రలో ఈదురుగాలులతో కూడి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడే ఛాన్స్ ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావం ఒడిశాలోని గంజాం, గజపతి, పూరీ, జగత్‌సింగ్‌పూర్ జిల్లాలపై పడనుంది. తీరం వెంబడి భారీగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నడిచే 95కుపైగా రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. జవాద్ తుఫాను ఉత్తరాంధ్ర నుండి ఒడిశా, వెస్ట్ బెంగాల్ వైపు కదులుతుందని, తెలంగాణకు జవాద్ తుఫానుతో ప్రమాదం తప్పిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 3 రోజుల పాటు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.