అమరావతి: రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇ-క్రాప్ ద్వారా రాష్ట్రంలో ఎంత మేర ఏ పంటలు సాగు అవుతున్నాయి... ఎరువుల వినియోగం ఎంత జరుగుతుందన్న లెక్కలు తీయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా సమస్య రాకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఈసారి 2.02 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయ్యిందని.. వాస్తవ డిమాండ్ కంటే అదనంగా నిల్వలు ఉన్నాయని అధికారులు వివరించారు. గతంతో పోలిస్తే ఈసారి 91 వేల మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా వచ్చినట్టు తెలిపారు. ఇక డీఏపీ 51,700 మెట్రిక్ టన్నుల మేర వచ్చిందని... గత ఏడాదితో పోలిస్తే 16 వేల మెట్రిక్ టన్నులు ఇది అదనమని అధికారులు సీఎంకు తెలిపారు. కాంప్లెక్స్ ఎరువులు కూడా ప్రస్తుత ఏడాదిలో 2.72 లక్షల మెట్రిక్ టన్నుల మేర వచ్చాయని వివరించారు. గతంతో పోలిస్తే 1.20 లక్షల మెట్రిక్ టన్నులు ఇది అదనమని తెలియచేశారు. దీనిపై స్పందించిన సీఎం రాష్ట్రంలో ఎరువుల లభ్యత ఇంతగా ఉన్నా.. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా యూరియా వినియోగం కూడా లెక్కించాలని అన్నారు.