విశాఖపట్నంలో యువతిపై ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడిని అడ్డుకునే ప్రయత్నంలో నిందితుడి చేతిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం విచారకరం అన్నారు. ఈ ఘటనపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
విశాఖలో ఓ యువకుడు యువతిని ప్రేమ పేరుతో బెదిరిస్తూ.. ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి దాడి చేశాడు. నగరంలోని మధురవాడ స్వయం కృషి నగర్‌లో నివాసం ఉంటున్న యువతి, ఆమె తల్లిపై విచక్షణారహితంగా నిందితుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. ఆ యువతిని రక్షించేందుకు తల్లి విశ్వప్రయత్నాలు చేసింది. దీంతో నిందితుడు ఆమెపై కత్తితో విరుచుకుపడ్డాడు. తీవ్ర గాయాలైన యువతి తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కత్తి దాడిలో యువతికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. యువతి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. దాడి తర్వాత ప్రేమోన్మాది పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పీఎం పాలెం పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.