2027 డిసెంబరు నాటికి అందరికీ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ను భూవివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
By - Medi Samrat |
ఆంధ్రప్రదేశ్ ను భూవివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 2027 డిసెంబరు నాటికి సర్వే పూర్తి చేసి రాష్ట్రంలో రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కలుగొట్ల గ్రామంలో మీ భూమి- మీహక్కు కింద పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. భవిష్యత్ లో ఎవరూ ట్యాంపరింగ్ చేయకుండా, ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎవరైనా ట్యాంపరింగ్ కు ప్రయత్నిస్తే నేరుగా జైలుకే వెళతారని, అవసరమైతే పీడీ యాక్టు కింద కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ...మీ భూమికి భద్రత కల్పించడం నాకు ఆనందాన్నిస్తోంది. భూమి ఆస్తి ఒక్కటే కాదు..అది మన జీవనాధారం. కుటుంబానికి భద్రత. భవిష్యత్‌కు నమ్మకం. కూటమి ప్రభుత్వం భూమి- నీరు-సాగుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. వివాదాలు లేని భూములు, పుష్కలంగా ప్రతి ఎకరాకు నీరు, లాభాలు తెచ్చిపెట్టేలా సాగును ప్రోత్సహించటమే లక్ష్యాలుగా పెట్టుకుని పనిచేస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడమే నా జీవితాశయం. కర్నూలు జిల్లాలో పశ్చిమ తాలూకాకు నీరు అందిస్తే రాష్ట్ర మంతటా నీరు ఇచ్చినట్టే. వారసత్వంగా వచ్చిన ఆస్తిపై వేరే వారి ఫొటోలు వేయడమేంటని గత ఎన్నికల్లో నేను ప్రశ్నించాను. గత పాలకులు తప్పుడు విధానాలతో ప్రజలను బానిసలు చేయాలని కుట్ర చేశారు. లోపభూయిష్టమైన ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తెచ్చారు. ప్రజల జుట్టు వాళ్ల చేతుల్లో పెట్టుకుని ఆడించాలని చూశారు. పట్టాదారు పాసు పుస్తకాలపై, పొలం సరిహద్దు రాళ్లపై వారి ఫొటోలు, పేర్లు ముద్రించుకున్నారు. వాళ్లు అడిగిన భూములు ఇవ్వకపోతే 22 ఏలో పెట్టారు. కక్ష తీర్చుకోవడానికి అన్ని ఆయుధాలు ఉపయోగించారు. ప్రజలను భయబ్రాంతులను చేసేందుకు పులివెందుల నుంచి మనుషులను తెచ్చుకున్నారు. రీ సర్వే పేరుతో రూ.700 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలపై ఫొటోలు వేసుకోవడం శాడిజం కాదా? లక్షల ఎకరాల ప్రైవైటు భూములను ప్రభుత్వ భూములుగా మార్చేశారు. రికార్డులు తారుమారు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ పక్కన హెలీప్యాడ్ కోసం..70 ఏళ్లుగా పక్కా డాక్యుమెంట్లు ఉన్న భూమిని ఒక వ్యక్తి దగ్గర బలవంతంగా తీసుకుని ప్రభుత్వ భూమిగా మార్చేశారు. ఇదేమని అడిగితే 22 ఏలో పెట్టి వివాదం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల వద్ద నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో 80 శాతం పైగా అర్జీలు రెవెన్యూ పరమైనవే వస్తున్నాయి. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించి ఏమీ తెలీనట్టు గత ఐదేళ్లు బ్రహ్మాండంగా పాలన చేసినట్టు మాట్లాడుతున్నారు. మీరు సమర్థవంతంగా పని చేస్తే ఇన్ని సమస్యలు ఎలా వచ్చాయి? నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను. నా జీవితంలో ఇలాంటి భూ సమస్యలు ఎప్పుడూ చూడలేదని" సీఎం చంద్రబాబు అన్నారు.
పైసా అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ
"అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశాం. భవిష్యత్ లో ఎవరూ ప్రజల భూమిపై కన్ను వేయకుండా భద్రత కల్పిస్తున్నాం. ప్రతీ పాస్ పుస్తకానికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్, యూనిక్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా సరే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలను వెంటనే తెలుసుకోవచ్చు. మీ పాసు పుస్తకంలో ఉన్న క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే అందులో వచ్చే మ్యాప్ మిమ్మల్ని నేరుగా మీ పొలం వద్దకు తీసుకు వెళుతుంది. డాక్యుమెంట్ల వివరాలను ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చైన్ లాంటి పటిష్ట వ్యవస్థను తెస్తున్నాం. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత. మీ రికార్డులన్నీ మీ అనుమతితోనే చేస్తున్నాం. ముందుగా డ్రాఫ్ట్ పట్టా దార్ పాస్‌బుక్ జారీ చేసి అందులో వ్యక్తిగత వివరాలు, భూమి వివరాలు సరిగ్గా ఉన్నాయో, లేవో భూ యజమానులు నిర్ధారించుకునే అవకాశం ఇచ్చాం. eKYC ధృవీకరణ తప్పనిసరిగా తీసుకుంటున్నాం. దీంతో తప్పులు దొర్లేందుకు వీలుపడదు. పైసా అవినీతి లేకుండా పట్టాదారు పుస్తకాలు ఇస్తున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు గ్రామాల చొప్పున రాష్ట్రంలో మొత్తం 279 గ్రామాల్లో ముందుగా పంపిణీ చేపట్టాం. ప్రస్తుతం 1,16,870 డ్రాఫ్ట్ పాస్ బుక్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటిలో 91,038 డ్రాఫ్ట్ పాస్ బుక్స్ eKYC కూడా పూర్తయ్యింది. కర్నూలు జిల్లాలోని 13 గ్రామాల్లో 8,347 మందికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. కలుగట్ల గ్రామంలో 1,178 కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేసుకుంటున్నాం. ఇప్పటివరకూ 37 లక్షల 40 వేల పట్టా దారు పాస్ పుస్తకాలు సిద్ధమయ్యాయి. ఇందులో 19 లక్షలు లక్షలు ఇప్పటికే పంపిణీ చేయగా..18 లక్షల 40 వేలు ఏప్రిల్ లోగా పంపిణీ చేస్తాం. ఇది కాకుండా 9,500 గ్రామాల్లో సర్వే చేయాలి. అవి చేస్తే 60 లక్షల మందికి కొత్తగా పాస్ పుస్తకాలు ఇచ్చే అవకాశం వస్తుంది. 2027 డిసెంబర్ నాటికి ప్రతి ఒక్కరికీ పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జాయింట్ ఎల్పీఎంల విషయంలో వివాదాలు పరిష్కరించుకోవాలని" ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
సీమలో ప్రాజెక్టులు టీడీపీ ఘనతే
"రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల ఘనత టీడీపీదే. హంద్రినీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ సహా అనేక ప్రాజెక్టులు రావడానికి నాడు తెలుగుదేశం పార్టీ చూపిన చొరవే కారణం. తెలుగుగంగ సీమను సస్యశ్యామలం చేయడంతో పాటు చెన్నై దాహార్తి తీరుస్తోంది. నదుల అనుసంధానం చేసి సీమను సస్యశ్యామలం చేస్తాము. అనంతపురం జిల్లాలో నీటి సంరక్షణకు మేము తీసుకున్న చర్యలతో ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీమను హార్టికల్చర్ హబ్ గా తయారుచేస్తున్నాం. దేశంలో ఎక్కువ పండ్లు పండేది రాయలసీమలోనే. రాష్ట్రంలో 400 లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు ఉత్పత్తి అయితే అందులో 220 లక్షల మెట్రిక్ టన్నులు సీమ నుంచే వస్తున్నాయి. రాబోయే రోజుల్లో 500 లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు ఉత్పత్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వంలో 8 సార్లు చార్జీలు పెంచారు. రూ. 32 వేల కోట్ల మేర విద్యుత్ భారాన్ని మోపారు. రూ.1.20 లక్షల కోట్ల అప్పు చేశారు. కూటమి ప్రభుత్వం భవిష్యత్ లో కరెంటు చార్జీలు పెంచబోదని హామీ ఇస్తున్నాను. నేనూ రాయలసీమలోనే పుట్టాను. ఎన్టీఆర్ కూడా సీమ ముద్దు బిడ్డే. మూడేళ్లలో కడప స్టీల్ ప్లాంట్ పనులు పూర్తి చేసే బాధ్యత నాది. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులు పెడుతున్నాం. సీమలో స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్, ఆటో మొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తున్నాయని" ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
సాగునీటి రంగానికి మా మొదటి ప్రాధాన్యత
"2014 -19 మధ్య సాగునీటి రంగానికి రూ. 68 వేల కోట్లు ఖర్చు చేశాం. గత పాలకులు పోలవరం ప్రాజెక్టు పాలిట శనిలా దాపురించారు. అసమర్థత, నిర్లక్ష్యంతో రూ. 440 కోట్ల విలువైన డయాఫ్రాం వాల్ దెబ్బతింది. దీని కోసం అదనంగా రూ. 1000 కోట్లు ఖర్చయింది. సమయం కూడా వృథా అయ్యింది. 2027లో పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తాం. పట్టి సీమ ద్వారా కృష్ణాడెల్టాకు గోదావరి నీరిచ్చి, శ్రీశైలం నీటిని సీమకు మళ్లించాం. పదేళ్లుగా సీమలో కరువు లేకపోవటానికి మా దూరదృష్టే కారణం. నీరుంది కాబట్టే కియాలాంటి పరిశ్రమలు వచ్చాయి. మచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులు ఉంచుకుని రాయలసీమ లిఫ్ట్ పేరుతో నాటకాలు ఆడారు. కర్నూలు జిల్లాకు నీరిచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. రాజోలి బండ, గురు రాఘవేంద్ర, వేదవతి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చే నీరు కర్నూలు జిల్లా ఉపయోగించుకుంటే నీటి సమస్య చాలా వరకూ తీరుతుంది. ఎమ్మిగనూరులో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది వస్తే 2 వేల మంది చేనేతలకు ఉపాధి లభిస్తుంది. గాజుల దిన్నె పూర్తి చేస్తాం. రూ.138 కోట్లతో ఎమ్మిగనూరు బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. ఎమ్మిగనూరు, ఆదోని మీదుగా రైల్వే లైన్లపై దృష్టి పెడతాం. సీమలో 120 ప్రాజెక్టులకు అనుమతి ఇస్తే గత పాలకులు అన్నిటినీ రద్దు చేశారని" ముఖ్యమంత్రి తెలిపారు.
శ్రీవారి లడ్డూ తయారీలో రసాయనాలు
"అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని వాడారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన నివేదికతో మేం మాట్లాడుతుంటే.. సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. రసాయనాలు కలిసినట్టు నివేదికలో ఉందని వాళ్ల బాబాయ్ కూడా మాట్లాడుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలుపెట్టాం. గత పాలకుల హయాంలో తయారు చేసిన లడ్డూకి ఇప్పటి లడ్డూ ప్రసాదానికి నాణ్యతలో ఎంతో వ్యత్యాసం ఉంది. శ్రీశైలంలోనూ రసాయనాలు వాడి ప్రసాదం కల్తీ చేశారు. తప్పు చేసి నన్ను క్షమాపణ చెప్పమంటున్నారు. పరామర్శల పేరుతో గుంటూరు వెళ్లేందుకు 6 గంటలు రోడ్డు బ్లాక్ చేసి మరే వాహనాలు వెళ్లకుండా ఇబ్బందులు పెట్టారు. గతంలో కాన్వాయ్ కింద సింగయ్య అనే వ్యక్తిని తొక్కించి చంపారు. బంగారుపాళ్యంలో మామిడి కాయలను కింద పడేసి బల ప్రదర్శనకు దిగారు. బలప్రదర్శన ఎన్నికల సమయంలో చేయాలి. ఇలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోను. శాంతిభద్రతల నిర్వహణలో కఠినంగా ఉంటాను. ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేయటంతో పాటు ప్రతీ రైతునూ ఆదుకుంటాం. ఉల్లికి రేటు లేకపోతే హెక్టారుకు రూ.50 వేల చొప్పున చెల్లించాం. మామిడి, కోకో పోగాకు లాంటి పంటలకూ సబ్సీడీ ఇచ్చి ఆదుకున్నాం." అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.