అభివృద్ధి యజ్ఞానికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు : సీఎం చంద్రబాబు
రుషికొండ ప్యాలెస్ కోసం రూ.500 కోట్లు దుర్వినియోగం చేసిన వాళ్లు.. ప్రజారోగ్యం కోసం యోగా నిర్వహించిన తమపై విష ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By - Medi Samrat |
రుషికొండ ప్యాలెస్ కోసం రూ.500 కోట్లు దుర్వినియోగం చేసిన వాళ్లు.. ప్రజారోగ్యం కోసం యోగా నిర్వహించిన తమపై విష ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్, రంగు రాళ్లపై బొమ్మల కోసం వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారే కానీ ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టారా అని ప్రశ్నించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కడుతుంటే జైల్లో పెడతామని బెదిరించడం వారి రాక్షసత్వానికి నిదర్శనమని సీఎం అన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ముందుగా పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించి ఆ తర్వాత కంపోస్ట్ తయారీ యార్డును సందర్శించారు. అనంతరం ప్రజా వేదిక సభలో పాల్గొని ప్రసంగించారు. ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. కేవలం ఒక కార్యక్రమంలా కాకుండా ప్రజల జీవన విధానంలో మార్పు తేవాలనే లక్ష్యంతో దీనికి శ్రీకారం చుట్టాము. 2026 జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ తయారు కావాలి. గ్రామాలు పరిశుభ్రంగా ఉండటమే కాదు...ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఈ స్వచ్ఛ ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఈసారి పర్యావరణంలో అవకాశాలు అందుకోవడం థీమ్‌గా తీసుకున్నాం. పర్యావరణం మనకు జీవనోపాధి కల్పిస్తుంది. సమగ్ర ఆర్ధిక వృద్ధికి దోహద పడుతుంది. వ్యర్థాలు-మురుగు నీటి నిర్వహణ, రీసైక్లింగ్ యూనిట్లు, కంపోస్టింగ్, పారిశుధ్య సేవలు, హరిత ఉత్పత్తులు, సర్క్యులర్ ఎకానమీ కార్యకలాపాలు...ఇవన్నీ స్థానికంగా ఉపాధి కల్పించేవే. ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ, వ్యర్థాల రీసైక్లింగ్ పాలసీ 2025ను తీసుకువచ్చాం. పొడి, తడి చెత్తను వేరు చేయడంపై చాలామందిలో అవగాహన వచ్చిందని పలువురు పారిశుధ్య కార్మికులు స్వయంగా నాకు చెప్పారు. వ్యర్థాలను వనరుగా, సంపదగా మారుస్తూ సర్క్యులర్ ఎకానమీకి అసలైన అర్థాన్నిచ్చాం. స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో పారిశుధ్య కార్మికులే నిజమైన సైనికులు. అందుకే వారి గౌరవం పెరిగేలా, వారి ఆరోగ్యానికి భద్రత కల్పించేలా చర్యలు తీసుకున్నాం. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాకారం అవుతుంది. ఈ కార్యక్రమంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి 21 విభాగాల్లో 69 రాష్ట్ర స్థాయి, 1,257జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డులు ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు.
అభివృద్ధికి రాక్షసుల్లా అడ్డంకులు
ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే కొందరు రాక్షసులు వివిధ రూపాల్లో అభివృద్ధి యజ్ఞాన్ని అడ్డుకుంటున్నారు. ఐటీ కంపెనీలకు భూములు ఇస్తే కేసులు వేస్తున్నారు. కానిస్టేబుళ్ల నియామకాలపైనా కోర్టులకు పోతున్నారు. పీపీపీలో మెడికల్ కాలేజీలు కడుతుంటే ప్రైవేటు పరమని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. యోగా మన భారతీయ సంపద. యోగాకు ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. ప్రపంచ గుర్తించేలా, వైజాగ్ పేరు మారుమోగేలా యోగా డే నిర్వహిస్తే దానిపైనా తప్పుడు ఆరోపణలతో విష ప్రచారం చేస్తున్నారు. విశాఖను గంజాయి, డ్రగ్స్ కేంద్రంగా వారు చేస్తే ఏఐ, డేటా సెంటర్, యోగా క్యాపిటల్ గా మేము తయారు చేసాం. గంజాయి వనాలుగా మార్చిన ప్రాంతాన్ని అరకు వనంగా మార్చాం. కూటమి పాలనలో దందాలు లేవు. గత పాలకులు రుషికొండ ప్యాలెస్ కు గుండు కొట్టించారు. రూ. 500 కోట్ల ప్రజాధనం వృథా చేశారు. సర్వే రాళ్లపై రూ.700 కోట్లు ఖర్చు చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా లక్ష్య సాధనలో వెనక్కు తగ్గేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ
‘గత పాలకులు చెత్తపై పన్ను వేయడమే కాకుండా 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మనకు వారసత్వంగా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చెత్త మొత్తం తొలగించాం. 2026, జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత ఏపీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు, రీసైక్లింగ్ యూనిట్లు, కంపోస్ట్ తయారీతో ఏ రోజు చెత్తను ఆరోజు ప్రాసెస్ చేస్తున్నాం. జనవరి 26 నాటికి రాష్ట్రంలో రోడ్డుపై చెత్త అనేది కనపడకూడదు. ఫ్రిబ్రవరి 15 నాటికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటి దగ్గర చెత్త సేకరించేలా ఏర్పాట్లు చేస్తాం. అక్టోబర్ 26 నాటికి పొడి,తడి చెత్త వేరు చేయడం 100 శాతం పూర్తి కావాలి. గ్రామాల్లో 10 లక్షల ఇళ్లలో కంపోస్ట్ తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇంటి వ్యర్థాలను కంపోస్ట్ గా తయారు చేసుకొని కూరగాయలు పండించుకోవచ్చు. వీలైనంత వరకూ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే ఏడాది అక్టోబర్ 2 తర్వాత ఎక్కడా ప్లాస్టిక్ కనపడకూడదు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 25 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు ఉన్నాయి. త్వరలో మరో 100 ప్రారంభిస్తాం. ప్రతీ ఉమ్మడి జిల్లాకు 6 నుంచి 8 చొప్పున స్వచ్ఛ రథాలు కేటాయిస్తాం. స్వచ్ఛ రథాలు ఏర్పాటు చేశాక గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇంట్లో చెత్త తీసి రోడ్డుపై వేసే అలవాట్లు మానుకోవాలి. అందరిలో సామాజిక స్పృహ రావాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
పరిశ్రమల హబ్‌గా అనకాపల్లి
గత పాలకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఆర్థికంగా దెబ్బతీశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ అమలు చేశాం. ప్రధాని మోదీ, మిత్రులు పవన్ కల్యాణ్ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందేలా చర్యలు తీసుకుంటున్నాం. నాతో సహా నేతలు, కలెక్టర్లు, ఎస్పీలు సహా గ్రామస్థాయి అధికారి వరకు ఎలా పని చేస్తున్నారో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాను. అనకాపల్లి జిల్లాను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే పరిశ్రమల కోసం రాంబిల్లి, పూడి, నక్కపల్లి, వల్లూరు, మాకవరపాలెంలో 24,843 ఎకరాలు అభివృద్ధి చేస్తున్నాం. కోడూరు, పరవాడ, అచ్యుతాపురంలో ఎంఎస్‌ఎంఈ పార్కులు తెస్తున్నాం. జిల్లాలో తొలి ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ నక్కపల్లిలో 93 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు అవుతోంది. మహిళల కోసం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ALEAPకు 32 ఎకరాలు కేటాయించాం. జిల్లాలో 46 భారీ పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. దేశంలోనే రెండో అతిపెద్ద బెల్లం మార్కెట్ ఇక్కడ ఉంది. అనకాపల్లి బెల్లాన్ని కూడా ప్రమోట్ చేస్తాం. ఉత్తరాంధ్రలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి పూర్వోదయ కింద కేంద్రాన్ని నిధులు కోరాము. అరకు కాఫీకి ప్రపంచ గుర్తింపు తెచ్చాం. కేజీ అరకు రూ.10,000కు కొనుగోలు చేశారంటే ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చని సీఎం అన్నారు.
ప్రపంచమంతా విశాఖ వైపు చూస్తోంది
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రపంచమంతా విశాఖ వైపే చూస్తోంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు, అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర రూపు రేఖలు మారబోతున్నాయి. ఇటీవల విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు ద్వారా రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 610 ఎంవోయూలు కుదిరాయి. SIPB ద్వారా మరో రూ.8.29 లక్షల కోట్లు పెట్టుబడులకు ఆమోదం తెలిపాం. వీటి ద్వారా మొత్తం 23 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. భాగస్వామ్య సదస్సులో అనకాపల్లి జిల్లాకు సంబంధించి 11 ఎంఓయూలు కుదిరాయి. విశాఖకు గూగుల్ వస్తోంది. ఇప్పటికే కాగ్నిజెంట్ వచ్చింది. టిసిఎస్ సహా అనేక ప్రతిష్టాత్మక సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు మొదలు పెడుతున్నాయి. ఆర్సెలర్ మిట్టల్ – నిప్పాన్ స్టీల్ లాంటి ప్రపంచ స్థాయి సంస్థ జిల్లాలో పెట్టుబడి పెడుతోంది. రూ.1.85 లక్షల కోట్లతో NTPC గ్రీన్ ఎనర్జీ సంస్థ ద్వారా 20 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తోంది. టూరిజం, టెక్నాలజీ, నాలెడ్జ్ కు విశాఖ కేంద్రం కాబోతోంది. ఇప్పటికే రాష్ట్రాన్ని మూడు రీజియన్లుగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు.