భయంతోనే ఆ మృగాడు ప్రాణాలు తీసుకున్నాడు : సీఎం చంద్ర‌బాబు

పలనాడు జిల్లా వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.

By -  Medi Samrat
Published on : 21 Feb 2026 4:09 PM IST

భయంతోనే ఆ మృగాడు ప్రాణాలు తీసుకున్నాడు : సీఎం చంద్ర‌బాబు

పలనాడు జిల్లా వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్ధిక విధ్వంసం చేశారని.. పరిశ్రమల్ని తరిమేశారని.. ఆంధ్రప్రదేశ్ కు ఉన్న నమ్మకాన్ని పోగొట్టారని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలు, భవిష్యత్ ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని మండిప‌డ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీ పునర్నిర్మాణం మొదలు పెట్టామ‌ని తెలిపారు. 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చాం.. టీచర్లు, పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాలు ఇచ్చామ‌న్నారు. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండేలా వేగంగా పనులు చేశామ‌ని.. కొత్త రోడ్లను కూడా నిర్మిస్తున్నామ‌న్నారు.

శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజార్చేలా కొందరు ప్రవర్తిస్తున్నారని.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బూతులు తిట్టే పార్టీ రాష్ట్రంలో ఉందన్నారు. ఆంబోతుల తరహాలో తయారై రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. గంజాయి రవాణా చేశారని ఫైర్ అయ్యారు. మదనపల్లెలో గంజాయి సేవించి మానవ మృగంగా ప్రవర్తించాడు.. ఆడబిడ్డల జోలికి వస్తే అది వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించాను.. చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది. ఆ భయంతో ఆ మృగాడు ప్రాణాలు తీసుకున్నాడని పేర్కొన్నారు.

గత పాలకులు శ్రీవారి ప్రసాదాన్ని కూడా నాసిరకంగా తయారు చేయించారు.. ఆ పవిత్రతను దెబ్బతీసే అధికారం ఎవ్వరికీ లేదు.. అలాంటి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు.. వారు సరఫరా చేసిన కల్తీ నెయ్యిని పరీక్ష చేయించాం.. జంతువుల కొవ్వు ఉందని ల్యాబ్ నివేదిక వచ్చిందన్నారు. దీనిపై ఏర్పాటైన సిట్ విచారణ చేసి అది అసలు నెయ్యే కాదని చెప్పింది.. వాళ్లు చేసిన తప్పును ఇతరుల పై నెట్టి వేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారన్నారు.

వివేకా హత్య ఘటనలో నాటకాల రాయుడు రోజుకు ఓ వేషం వేశాడు.. చిన్నాన్న కుమార్తె కూడా మోసపోయేంతగా నాటకాలు వేశారు.. లడ్డూ ప్రసాదం అపవిత్రం చేశారని చెబితే అవినీతి జరిగిందని చెబుతుంటే తిరిగి హెరిటేజ్‌పై ఆరోపణలు చేస్తున్నారు.. రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత నా ఒక్కడిదే కాదు ప్రజలందరిదీ కూడా.. చెడును నిరాకరించే పరిస్థితి ప్రజల్లోనూ రావాలి.. అప్పుడే రాజకీయ ప్రక్షాళన జరుగుతుందన్నారు.

ఎన్నికల ముందు ఉన్నపళంగా నన్ను అరెస్టు చేస్తున్నామని చెప్పి జైల్లో వేశారన్నారు.. కేవలం ప్రజల కోసమే, రాష్ట్రం కోసమే ఇప్పటికీ పోరాటం చేస్తున్నాను.. జైల్లో నుంచి తిరిగి రారని చాలా మంది నాకు చెప్పారు.. నేను ఏనాడు భయపడలేదన్నారు.

సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వర స్వామి ఫోటోను కూడా శాసన మండలిలోకి తీసుకువెళ్లి రాజకీయం చేశారు.. చెప్పులు వేసుకుని, వేంకటేశ్వరస్వామి ఫోటోను విసిరివేస్తారా.? ఎందుకు వాళ్లకింత అహంకారం? అని మండిప‌డ్డారు. రాష్ట్రంలో కొందరు చెత్త రాజకీయాలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారు. పరామర్శలని చెప్పి వెళ్లి వాళ్ల కార్ల కింద మనుషుల్ని చంపేస్తారు.. బూతులు తిట్టిన వాళ్లను, రౌడీయిజం చేసిన వాళ్లను పరామర్శించే వ్యక్తులు.. వాళ్ల కారు కింద పడిన వారిని మాత్రం పరామర్శించరని దుయ్య‌బ‌ట్టారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి దానిని అపవిత్రం చేసిన వ్యక్తులు తిరిగి ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు.. దొంగే దొంగా దొంగా అనే పరిస్థితి వచ్చింది.. దీనిని అడ్డుకుని తీరతామ‌న్నారు.

Next Story