ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్లపై రగడ కొనసాగుతోంది. సినిమా టికెట్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పలువురు యాజమానులు స్వచ్ఛంధంగా థియేటర్లు మూసివేస్తున్నారు. ఇటీవల సినిమా థియేటర్లపై రెవెన్యూ, పోలీసు అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని థియేటర్లకు సినిమా టికెట్ ధరలపై సూచనలు చేశారు. టికెట్ ధరలు పెంచి అమ్మకూడదని అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వం చెప్పిన ధరలకు టికెట్లు అమ్మితే తాము నష్టాలను చూడాల్సి వస్తుందని పలువురు థియేటర్ల యజమానులు స్వచ్ఛంధంగా థియేటర్లను మూసివేస్తున్నారు.
థియేటర్లను తాత్కాలికంగా మూసివేస్తూ.. బయట బోర్డులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నెల్లూరు నగరంలోని సూళ్‌లూరుపేట నేషనల్ హైవేపై వి-ఎపిక్ థియేటర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ మేరకు థియేటర్‌ను మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. వి-ఎపిక్ సినిమా థియేటర్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్క్రీన్ కలిగి ఉంది. ఇక్కడ సినిమా చూసేందుకు సినీ అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 35కి అనుగుణంగా థియేటర్ నడపడం సాధ్యం కాదని యాజమాన్యం తెలిపింది. ఈ విషయం తెలియక కొందరు సినీ ప్రియులు థియేటర్‌కు దగ్గరకు వచ్చి.. నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.