తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచే 75 శాతం ఆదాయం వస్తుందని...మనకు అటువంటి అవకాశం లేనందున ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో శాఖల వారీ పురోగతిపై చర్చించారు. మరోవైపు బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందున్నప్పటికీ... పన్ను ఆదాయం ఆస్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలని... పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్ ఏర్పాటు చేయాలని... ప్రతి శాఖకు ఏఐ బృందం ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు అందించేలా వచ్చే రెండు, మూడు నెలల్లో ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
ఏడాది కాలంలో తీసుకువచ్చిన పాలసీలను పటిష్టంగా అమలు చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయ వనరులు పెంచుకుని తన కాళ్లపై తాను నిలబడాల్సిన అవసరం ఉందని...అప్పుడే అభివృద్ది, సంక్షేమ పథకాలకు విరివిగా నిథులు ఖర్చు చేయగలం అని సిఎం అన్నారు. కేంద్ర సాయం, అప్పులు అనేది ప్రాధమిక దశలో నిలబడేందుకు మాత్రమే ఉపయోగపడతాయని.... మంచి పనితీరు ద్వారా ఆయా శాఖల్లో ఆదాయం పెరిగే ప్రణాళికలు అమలు చేయాలని సిఎం అధికారులకు స్పష్టం చేశారు. ఒకటి రెండు శాఖలు ఏడాది కాలంలో అనుకున్నంత పురోగతి సాధించలేదని....ఆయా శాఖల పనితీరు మెరుపడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.