సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు లేఖ‌

Chandrababu Letter To CM Jagan. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు

By Medi Samrat  Published on  17 Jun 2021 9:57 AM GMT
సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు లేఖ‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ధాన్యం బకాయిలను చెల్లించాలని చంద్రబాబు నాయుడు జగన్ కు లేఖ రాశారు. మద్దతు ధరకు కొనుగోలు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని.. రైతు ప్రభుత్వం అని చెప్పి.. వారినే నిండా ముంచే విధానాలను అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. తెదేపా ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే వాళ్ళమని ఇప్పుడు అలా జరగడం లేదని అన్నారు. పంటలు పండించేందుకు తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు ఎవరు కడతారు?, ఖరీఫ్ కు పెట్టుబడులు ఎవరిస్తారు? అని ముఖ్యమంత్రిని చంద్రబాబు ప్రశ్నించారు. రాయలసీమలో అరకొరగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టారని.. ధాన్యం కొనుగోలుకు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల పేరుతో హడావుడి చేశారు తప్ప రైతులకు ఎటువంటి ప్రయోజనం జరగలేదని అన్నారు.

ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని.. బ‌కాయిల‌ను వెంటనే చెల్లించాలని కోరారు. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడంలో స‌ర్కారు విఫలమైందన్నారు. వైసీపీ సర్కారు రైతుల‌కు న‌ష్టం తెచ్చిపెట్టే విధానాలను అనుసరిస్తోందని విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోళ్లు చేసి రెండు నెలలు దాటినా రైతుల అకౌంట్లలో డబ్బులు జ‌మ చేయ‌ట్లేదని అన్నారు. ఒక్క గోదావరి జిల్లాల్లోనే రూ.2500 కోట్లు బకాయిలు ఉన్నాయని.. వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న‌లో ధాన్యం సేకరణలోనూ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయ‌న విమ‌ర్శించారు. రాయలసీమలో వేరు శనగ పంట నష్టపోయినా పెట్టుబడి రాయితీ అందలేదని.. కౌలు రైతులకు కూడా ప్రభుత్వ సాయం అందడం లేదన్నారు. సున్నావడ్డీ రుణాలు, పంట బీమా, ఇన్ పుట్ సబ్సీడీ చెల్లింపుల్లోనూ కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఏపీలో మిల్లర్లు, వైసీపీ నాయకులు క‌లిసి రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు.


Next Story