నా టెంపర్ లూజ్ అయితే తట్టుకోలేరు : దాడులపై నిప్పులు చెరిగిన చంద్రబాబు
Chandrababu Fires On YSRCP. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇటువంటి ఘటనలు చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు
By Medi Samrat Published on 19 Oct 2021 3:45 PM GMT40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇటువంటి ఘటనలు చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం రాష్ట్రంలో నడుస్తోందని అన్నారు. ఏపీలో ప్రభుత్వం పోలీసులు కుమ్మక్కై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ కార్యాలయంపై దాడులు చేయడం దేనికి సంకేతం.. ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందని.. దాడులకు పోలీసులు, ముఖ్యమంత్రి బాద్యులని ఆరోపించారు. దాడులకు సీఎం, డీజీపీ బాధ్యత వహించాలని అన్నారు.
కార్యకర్తలు టీడీపీ కార్యాలయాలను దేవాలయంగా భావిస్తారని.. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య పోరాటాలకు నిలువుటద్దం లాంటివని అన్నారు. 100 గజాల దూరంలో డీజీపీ ఆఫీసు ఉండి కూడా ఏమి చేయలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను డీజీపీకి ఫోన్ చేస్తే స్పందించలేదని.. ఆర్గనైజ్డ్ గా దాడులకు పాల్పడుతున్నారని.. మీరు లాలూచీ పడే దాడి చేయించారని ఆరోపించారు. డీజీపీకి, సీఎంకు తెలియకుండా జరిగిన దాడి కాదని ఆరోపించారు.
రాష్ట్రం డ్రగ్ మాఫియాగా మారిందని.. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలుతుందని చెప్పడం కూడా తప్పా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడుకు ఇక్కడ నుంచే గంజాయి తరలుతుందని ఆరోపించారు. ఏపీ వ్యాప్తంగా రేపు బంద్ కు పిలుపునిచ్చారు చంద్రబాబు. పార్టీ కార్యాలయంపై దాడి చేసి ప్రతిపక్ష నేతలను చంపాలని చూస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల ఇళ్లపై కూడా దాడులు చేశారని.. ఎంత మందిని చంపుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మనుషుల ప్రాణాలు పోతుంటే సంయమనం పాటించాలని డీజీపీ స్టేట్మెంట్స్ ఇస్తారా.? అని ఫైర్ అయ్యారు. డీజీపీ ఆఫీసుపై దాడి జరిగితే.. ఆయన కూడా సంయమనం పాటిస్తారా.? అని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే దాడి జరిగిందని.. రెండోసారి పట్టాభి ఇంటిపై దాడి చేశారని.. సెక్యూరిటీ ఇవ్వాలని కోరినా ఇప్పటి వరకు ఇవ్వలేదని అన్నారు. అప్రజాస్వామిక చర్యలు వద్దని చెప్పడమే మేము చేసిన తప్పా అని ప్రశ్నించారు. డ్రగ్ మాఫియాతో దాడులు చేయిస్తారా అని ప్రశ్నించారు.
కార్యకర్తలు ఎవ్వరు బయపడొద్దని భరోసా ఇచ్చారు చంద్రబాబు. స్టేట్ టెర్రరిజంపై పోరాటం చేస్తామని తెలిపారు. తాగుబోతులను తీసుకొచ్చి దాడి చేయిస్తే నేను భయపడనని.. వైసీపీ నేతలను వదిలిపెట్టనని హెచ్చరించారు. ప్రజల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రాగానే ఇటువంటి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. హౌస్ అరెస్టులు చేసే అధికారం మీకు ఎవ్వరు ఇచ్చారని.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. బంద్ కు అందరూ కలిసి రావాలని కోరారు. మా వాళ్ళు భూతులు తిట్టిన వారించానని.. నేను ఎప్పుడు ఎవరిని భూతులు తిట్టలేదని తెలిపారు. నన్ను మా పార్టీ నేతలను ఎన్నిసార్లో భూతులు తిట్టారని.. నన్ను ఎన్నిసార్లు తిట్టారు.. ఎలా తిట్టారో మీకు తెలీదా.. అనరాని మాటలు అన్నారు.. నా టెంపర్ లూజ్ అయితే మీరు తట్టుకోలేరని హెచ్చరించారు. పరిధి దాటి మాట్లాడింది వైసీపీ నేతలేనని.. చెప్పలేని చెప్పుకోలేని విధంగా భూతులు తిట్టారని.. వైసీపీ నేతలు పరిధి దాటి మాట్లాడలేదా అని ప్రశ్నించారు.