ఇంతటి ఘోరమైన సభ చూడలేదని.. కౌరవుల సభలా వ్యవహరించారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. నా భార్యని నీచ రాజకీయాలలోకి లాగడం హేయమైన చర్య అని.. తప్పని చెప్పాల్సిన స్పీకర్ నోరు మెదపలేదని.. తమ్మినేని గతాన్ని మర్చిపోయారని వాపోయారు. తమ్మినేని నాకు మైక్ ఇవ్వకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.. ఆత్మ విమర్శ చేసుకోవాలని స్పీకర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇంతకంటే నాకు ఏ పదవులు అవసరం లేదని ప్రజలు తెలుసుకోవాలని.. తప్పులను వేరొకరిపై రుద్ది పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.
ఇది ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న యుద్ధం.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటా.. రికార్డులు నాకు కొత్త కాదని పేర్కొన్నారు. రాజకీయాలకు సంబంధం లేని నా భార్యని దూషించడం నీచమని.. రాజకీయాల్లో విలువలు ఉండాలనే ఇంతకాలం ఊరుకున్నానని చంద్రబాబు అన్నారు. క్రమశిక్షణ ఉంది కాబట్టే.. సైలెంట్ గా ఉన్నాను.. మాకు చేతకాక కాదు ఇంత కంటే నీచంగా మాట్లాడగలనని హెచ్చరించారు. ప్రజలు నాకు మద్దతు ఇవ్వాలి.. రాష్ట్రానికి పట్టిన పీడ వదలాలని అన్నారు. మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని.. మన ఇంటి వాళ్ళని అంటే ఎలా ఉంటుందో.. ఆలోచించండి.. అదే నా ఆవేదన.. అంటూ కన్నీటితో ప్రెస్ మీట్ ముగించారు చంద్రబాబు.