తెలంగాణలో కులగణన దేశానికే ఆదర్శం.. ఏపీలోనూ చేపట్టాలి: షర్మిల

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే దేశానికి ఆదర్శం అని ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.

By Knakam Karthik  Published on  4 Feb 2025 4:08 PM IST
Andrapradesh, Ys Sharmila, Caste Census, Tdp, Congress, Bjp, Janasena, Ysrcp

తెలంగాణలో కులగణన దేశానికే ఆదర్శం.. ఏపీలోనూ చేపట్టాలి: షర్మిల

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే దేశానికి ఆదర్శం అని ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఇదో చారిత్రక ఘట్టం, ఈ సర్వే యావత్ భారతావని కి దిక్సూచి అన్నారు. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూర దృష్టికి ఇదొక నిదర్శనం అన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు, 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు… అంటే దాదాపు 90 శాతం వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని నమ్ముతున్నాం.

ఏపీలోనూ కుల గణన చేపట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాలి. కుల వివక్షకు గురవుతున్న బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయాలి. మనమెంతో మనకంతా అన్నట్లుగా.. రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాలలో వారి వాటా వారికి దక్కాలని షర్మిల అన్నారు.

గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టినా.. బీజేపీ దత్తపుత్రుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఆ సర్వే వివరాలు తొక్కిపెట్టారు. బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. బీజేపీ డైరెక్షన్ లోనే సర్వే రిపోర్టు బయటకు పొక్కకుండా కుట్ర చేశారు. ఇక దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తుంటే.. రిజర్వేషన్లు రద్దుకు కుట్ర అని బీజేపీ తప్పు దారి పట్టిస్తోంది. బీజేపీ ఉచ్చులో మీరు పడవద్దని.. వెంటనే ఏపీలో కూడా కులగణన చేపట్టాలని..ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నామని షర్మిల అన్నారు.

Next Story