ఆంధ్రప్రదేశ్‌లో ఉనికి చాటుకునేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో సత్తా చాటుకోవాలని వ్యూహా రచన చేస్తోంది. తాజాగా వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీ-జనసేన కూటమి అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు బుధవారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీయేతర ప్రభుత్వం వల్లే రాష్ట్రం ఇంకా వెనుకబడి ఉందన్నారు. ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరమని ఆయన అన్నారు. ప్రజలు టీడీపీకి అండగా లేరని ఎంపీ జీవీఎల్ అన్నారు.
''రాష్ట్రంలో బీజేపీని విస్తరించడంలో భాగంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపై మేము దృష్టి సారించాము.'' అని ఆయన వివరించారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో బలమైన వ్యతిరేకత ఉందని ఆయన వివరించారు. బీజేపీ ప్రభుత్వం లేక ఏపీ అన్ని రంగాల్లో వెనకబడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేలకుపైగా సమావేశాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అదిష్ఠానం స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు. వైసీపీ ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడుతామని జీవీఎల్ అన్నారు.
బీజేపీ, జనసేన కూటమిలో భాగస్వాములు మాత్రమేనని జీవీఎల్ మరోసారి పునరుద్ఘాటించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 400 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి భారీ విజయవంతమైన వ్యూహం అమలుకు సిద్ధమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఇక రాహుల్‌గాంధీ ఎన్ని పాదయాత్రలు చేసినా కాంగ్రెస్‌కు ఉపయోగం లేదన్నారు. ఆ పార్టీ నేతలే కాంగ్రెస్ పని అయిపోందని అంటున్నారని చెప్పారు.