రాష్ట్రంలో సినిమా థియేటర్లపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. సినిమా థియేటర్లపై కావాలని దాడులు చేయడం లేదన్నారు. సినిమా అనేది సామాన్యుడికి వినోద సాధనం అని మంత్రి బొత్స పేర్కొన్నారు. సినిమా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని.. ఇష్టం వచ్చినట్లు టికెట్ ధరలు ఎలా నిర్ణయిస్తారని మంత్రి బొత్స ప్రశ్నించారు. టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా అని అన్నారు. సినిమా చూసేవారికి మేలు చేసేందుకే ప్రభుత్వ ప్రయత్నం చేస్తోందన్నారు. సామాన్యులకు టికెట్ ధరలను అందుబాటులోకి తీసుకురావడమే తమ సర్కార్ లక్ష్యమని.. సినీ పరిశ్రమను ఇబ్బందులకు గురి చేయడం కాదన్నారు.
విజయనగరంలో మంత్రి బొత్స మీడియా మాట్లాడారు. నష్టాల్లో ఉన్నామని భావిస్తే థియేటర్ యాజమానులు అధికారులను కలిసి విన్నవించుకోవాలని.. అప్పుడు ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు టికెట్ ధరలు పెంచి.. అమ్మితే ప్రభుత్వం ఒప్పుకోదని అన్నారు. సినిమా టికెట్‌కు ఎమ్మార్పీ ధర ఉంటే తప్పేంటని బొత్స ప్రశ్నించారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని మంత్రి బొత్స పేర్కొన్నారు. ప్రేక్షకులకు మేలు చేసేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి బొత్స తెలిపారు.