సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ..కీలక శాఖల పురోగతిపై సుదీర్ఘ చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు.
By - Knakam Karthik |
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ..కీలక శాఖల పురోగతిపై సుదీర్ఘ చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, కీలక అంశాలపై చర్చించేందుకు ముందుగా అనుకున్న నిర్ణయం ప్రకారం ఈ సమావేశం జరిగింది. ఉండవల్లి చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ భేటీలో ప్రధానంగా టీటీడీ అంశాలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ స్థానాలు మరియు నామినేటెడ్ పదవుల భర్తీపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతల్లోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్ మరియు అటవీ శాఖలకు సంబంధించిన కీలక ప్రాజెక్టుల పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం మరియు నియోజకవర్గాల వారీగా పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపులపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన 'మ్యాజిక్ డ్రెయిన్ల' (Magic Drains) నిర్మాణం పారిశుధ్య నిర్వహణలో ఎంతటి సానుకూల మార్పులు తీసుకువస్తుందో వివరించిన పవన్, వీటిని అన్ని పంచాయతీలకు విస్తరించాలని కోరారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి, నీటిపారుదల శాఖ పరిధిలోని డ్రైనేజీల్లో పూడికతీత పనుల అంశాన్ని ఉపముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వేసవి కాలంలోనే ఈ పనులను పూర్తి చేయడం ద్వారా రైతులు పంటలు వేసే సమయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. వీటితో పాటు అటవీ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'హనుమాన్ ప్రాజెక్ట్' వివరాలను కూడా ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వ పాలనలో సమన్వయం, అభివృద్ధి పనుల వేగవంతం లక్ష్యంగా ఈ భేటీ కొనసాగింది.