ర‌ఘువీరారెడ్డి రీ ఎంట్రీ ఇచ్చారు..! ఎక్క‌డి నుంచో తెలుసా.?

AP Congress Ex Pcc President Raghuveera Reddy Back To Politics

By Medi Samrat  Published on  18 April 2023 9:11 AM GMT
ర‌ఘువీరారెడ్డి రీ ఎంట్రీ ఇచ్చారు..! ఎక్క‌డి నుంచో తెలుసా.?

AP Congress Ex Pcc President Raghuveera Reddy Back To Politics


ఆయ‌న‌ అవిభ‌క్త‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓ వెలుగు వెలిగిన రాజ‌కీయ‌ నాయ‌కుడు. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడు. క‌దిలితే కాన్వాయ్ మోత‌లు.. చుట్టూ సెక్యూరిటీ పోలీసులు.. మందిమార్భ‌లం.. ఓ రేంజ్ జీవితాన్ని లీడ్ చేసిన‌ మ‌నిషి. రాజ‌శేఖ‌ర్ రెడ్డి, రోశ‌య్య‌, కిర‌ణ్ కుమార్ రెడ్డి మంత్రివ‌ర్గాల‌లో మంత్రిగా ప‌నిచేశాడు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు పీసీసీ అధ్య‌క్షుడిగా కూడా ప‌నిచేశాడు. స‌డెన్‌గా ఏమైంది..? రాజ‌కీయాల‌కు దూరంగా అత్యంత‌ సాధార‌ణ జీవితం గ‌డుపుతున్నాడు. ట్రాక్ట‌ర్ న‌డుపుతూ.. నారుమ‌డి దున్నుతూ వ్య‌వ‌సాయ క్షేత్రంలో రైతుగా క‌నిపించేవాడు. స్వ‌గ్రామంలో గుడి నిర్మాణంలో పాల్గొనేవాడు. ఊళ్లో న‌డుచుకుంటూ తిరిగేవాడు. మ‌న‌వ‌రాలితో ఆడుకుంటూ క‌నిపించేవాడు. ఇదంతా చూసి రాజ‌కీయాల మీద విర‌క్తి పుట్టిందేమో.. ఏదైనా ఆరోగ్య ప‌మ‌స్య ఉందేమో.. అని ఎవ‌రికి తోచిన‌ట్లుగా వారు అనుకునేవారు. ఆయ‌న ఎవ‌రో కాదు నీల‌కంఠాపురం ర‌ఘువీరారెడ్డి.

జ‌నాల అంచ‌నాల‌ను త‌ల‌క్రిందులు చేస్తూ ర‌ఘువీరారెడ్డి మ‌ళ్లీ ప్ర‌జాక్షేత్రంలోకి అడుగిడుతున్నారు. అవును కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో రఘువీరారెడ్డి కీల‌క‌పాత్ర‌ పోషించబోతున్నారు. బెంగళూరు సిటీ పరిశీలకుడిగా ఏఐసీసీ రఘువీరాను నియమించింది. అంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో ర‌ఘువీరారెడ్డి యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి వస్తున్నారు. వివాద‌ర‌హితుడిగా పేరున్న‌ ర‌ఘువీరారెడ్డికి స్వాగ‌తం ప‌లుకుతూ ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ర‌ఘువీరారెడ్డి 1985లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తగా ఈయన రాజకీయ ప్రస్థానం మొదలయ్యింది. 1989లో అనంతపురం జిల్లా మడకశిర నుంచి పోటీ చేసి గెలుపొంది మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొద‌టిసారే కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా అవ‌కాశం ద‌క్కింది. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి చేతిలో సుమారు ఆరువేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. తర్వాత 1999, 2004లలో వరుసగా గెలుపొందారు. 2009లో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి, రోశ‌య్య‌, కిర‌ణ్ కుమార్ రెడ్డి మంత్రివ‌ర్గాల‌లో మంత్రిగా ప‌ద‌వులు చేప‌ట్టారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో పెనుగొండ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. టీడీపీ అభ్యర్థి పార్థసారథి చేతిలో ఓడిపోయారు. అప్ప‌టినుండి ఆయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయ‌ల‌కు దూరంగా ఉంటున్నారు.


Next Story