ఏపీలో ఆస్పత్రి నిర్మాణం.. 'కేజీఎఫ్‌' డైరెక్టర్ భారీ సాయం

KGF director Prashant Neel helped a lot in building a hospital in AP. 'కేజీఎఫ్‌' మూవీతో రికార్డులు సృష్టించారు పాన్‌ ఇండియా డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్. ఆ తర్వాత 'కేజీఎఫ్‌-2'తో ఇండియా

By అంజి  Published on  16 Aug 2022 4:59 PM IST
ఏపీలో ఆస్పత్రి నిర్మాణం.. కేజీఎఫ్‌ డైరెక్టర్ భారీ సాయం

'కేజీఎఫ్‌' మూవీతో రికార్డులు సృష్టించారు పాన్‌ ఇండియా డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్. ఆ తర్వాత 'కేజీఎఫ్‌-2'తో ఇండియా మూవీ ఇండస్ట్రీని షేక్‌ చేశారు. చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఏపీకి చెందిన ప్రశాంత్‌ నీల్‌ కాంగ్రెస్‌ నేత రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్‌ రెడ్డి కొడుకు. ప్రశాంత్‌ నీల్‌ది సత్యసాయి జిల్లాలోని నీలకంఠాపురం. తాజాగా అక్కడ జరిగిన తన తండ్రి జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రశాంత్‌ నీల్‌.. తన స్వగ్రామంలో నిర్మిస్తున్న ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి కోసం రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.

తండ్రి 75వ జయంతి సందర్భంగా ప్రశాంత్ నీల్‌ ఈ విరాళం అందించినట్లు రఘువీరా రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కాగా ప్రశాంత్‌ నీల్‌ పుట్టింది నీలకంఠాపురమే అయినా.. పెరిగింది మాత్రం బెంగళూరులోనే. కొన్ని నెలల కిందట ప్రశాంత్‌ నీల్‌ తండ్రి సుభాష్‌ రెడ్డి చనిపోయారు. అప్పటి నుంచి వీలున్నప్పుడల్లా ప్రశాంత్‌ నీల్‌ తన సొంతూరికి వచ్చిపోతున్నాడు. ఆగష్టు 15న సుభాష్ రెడ్డి జయంతి కావడంతో సొంతూరి వచ్చిన ప్రశాంత్‌ తండ్రి సమాధికి నివాళులర్పించారు.

ఆ తర్వాత నీలకంఠాపురంలో నిర్మిస్తున్న ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి తన వంతుగా భారీ విరాళాన్ని ప్రశాంత్‌ నీల్‌ అందించారు. ఇక నుంచి నీలకంఠాపురంలో తన చిన్నాన్న రఘువీరారెడ్డి చేపట్టే సేవా కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొంటానని చెప్పారు. తగిన సహాయం అందిస్తానని, తాను చనిపోయిన తర్వాత కూడా ఇక్కడే తన సమాధి నిర్మించాలని కుటుంబ సభ్యులకు చెప్తానని వెల్లడించాడు. నీలకంఠాపురంలో ప్రశాంత్ నీల్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను రఘువీరారెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.


Next Story