ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆ రాష్ట్ర పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. వచ్చే సంవత్సరం నుండి వృద్ధ్యాప్య పింఛనును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలనెలా రూ.2,225 పెన్షన్ ఇస్తున్నారు. దీనిని రూ.2,500కు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి అమలు చేయనున్నట్లు చెప్పింది. మంగళవారం నాడు సీఎం వైఎస్ జగన్.. జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాప్య పెన్షన్‌ని పెంచుతున్నట్లు ప్రకటించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెన్షన్లను రూ. 3000లకు పెంచుతామని సీఎం జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో 61,72,964 మంది పెన్షనర్లు.. ప్రతీ నెలా పెన్షన్ తీసుకుంటున్నారు.
డిసెంబర్, జనవరి నెలల్లో నిర్వహించే కార్యక్రమాలను సీఎం జగన్ తెలిపారు. డిసెంబర్ 21వ తేదీన గృహహక్కు పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అలాగే వచ్చే సంవత్సరం 2022 జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఈబీసీ పథకం ద్వారా అగ్రవర్ణ నిరుపేద మహిళలకు లబ్ది చేకూరనుంది. మూడేళ్లలో రూ.45 వేలు చొప్పున 45 నుండి 60 ఏళ్ల లోపు మహిళలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. అలాగే జనవరిలో రైతు భరోసా ఇవ్వనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అయితే రైతు భరోసా సాయం తేదీని మాత్రం సీఎం జగన్ ప్రకటించలేదు.