ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ ముగిసింది. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించారని తెలుస్తోంది. ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ దాదాపు గంట పాటు సాగింది. అలాగే సీఎం వైఎస్ జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, గోరంట్ల మాధవ్, మిథున్ రెడ్డిలు ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యలు, కీలక అంశాలను సీఎం జగన్ నివేదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఆర్థిక ప్రగతిని దెబ్బతీసిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ప్రస్తుత ఆదాయ గణాంకాలే నిదర్శనమని ప్రధాని మోడీతో సీఎం జగన్ అన్నారు. ఈ భేటీలో ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని కోరినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర విభజనతో రాజధానిని ఏపీ కోల్పోయిందని, ప్రత్యేక హోదాతో పాటు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే చాలా వరకు ఊరట కలుగుతుందని ప్రధాని మోడీకి సీఎం జగన్ వివరించారు. పోలవరం నిధుల విషయమై కూడా పెండింగ్‌లో ఉన్న నిధులను చెల్లించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా సీఎం జగన్ సమావేశం జరిగింది. ఇవాళ రాత్రి 8 గంటలకు కేంద్ర విమానయాన మంత్రి సింథియాను సీఎం జగన్ కలవనున్నారు. రేపు ఉదయం 9.30 గంటలకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ భేటీ కానున్నారు.